- నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- 190 ఎగ్జిక్యూటివ్ పోస్టులు మంజూరు..
తెలంగాణ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థల్లో కొత్తగా 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులన్నీ రెవెన్యూ (దేవాదాయ) శాఖ పరిధిలోని కమిషనర్ కార్యాలయం పరిధిలో భర్తీ కానున్నాయి. టీజీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టులను మూడు గ్రేడ్‌లలో భర్తీ చేస్తారు. గ్రేడ్ 1 ఈవో పోస్టులు 41, గ్రేడ్ 2 ఈవో పోస్టులు 62, గ్రేడ్ 3 ఈవో పోస్టులు 87 వరకు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
యాదాద్రి-భువనగిరి జోన్‌లో పోస్టుల సంఖ్య: 48.. జోగులాంబ జోన్‌లో పోస్టుల సంఖ్య: 28.. భద్రాద్రి-కొత్తగూడెం జోన్‌లో పోస్టుల సంఖ్య: 20.. బాసర జోన్‌లో పోస్టుల సంఖ్య: 14.. రాజన్న జోన్‌లో పోస్టుల సంఖ్య: 7.. కాళేశ్వరం జోన్‌లో పోస్టుల సంఖ్య: 6..
దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు ప్రభుత్వ అనుమతి లభించడంతో పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్‌తో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. డిగ్రీ అర్హత కలిగిన హిందూ అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు.
