సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవాన్ సత్య సాయిబాబా ఆలోచనలను, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. సాయిబాబా శత జయంతి ఉత్సవాల(Centenary celebrations)ను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియం(Puttaparthi Hill View Stadium)లో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
- మానవ రూపంలోని దేవుడు (God in human form) సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
- సాయిబాబా మనుషుల్లో దేవుణ్ని చూశారు. ప్రేమతో మనుషులను గెలిచారు. సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారు. మానవులను ప్రేమించాలి. ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.
- సత్య సాయిబాబా మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వాహకులు అందరిలో కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను బాబా, వారి ట్రస్టు ద్వారా చేసి చూపించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచిత విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
- విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారు. జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నారు.
- పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహార్తిని తీర్చారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారు. తమిళనాడులో సైతం బాబా సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించారు.
- మానవ సేవే మాధవ సేవ అని బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారు. ఈనాడు 140 దేశాల్లో బాబాకి భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారు. సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాల ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.
- సత్య సాయిబాబా ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది.
- పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో కార్యక్రమం తర్వాత సీఎం.. సాయి కుల్వంత్ హాల్‌లోని సత్య సాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు.
