- కడ్తాల్‌లో నాలుగు రోజుల్లో 3,040 మందికి పైగా సేవలు
- 1,950 మందికి కంటి పరీక్షలు.. 1,170 మందికి ఉచిత కళ్లద్దాలు
- 117 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లకు ఎంపిక
- నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉచిత ఆపరేషన్లు
గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న పేద,మధ్యతరగతి ప్రజలకు సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాలు(Free Eye Medical Camp) అండగా నిలుస్తున్నాయి.కంటి వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిబిరానికి రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.కడ్తాల్‌లోని ఎం.బి.ఏ.గార్డెన్స్‌లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో శంకర నేత్రాలయ, చెన్నైకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సుంకిరెడ్డి 6వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం’(Free Eye Medical Camp) నాలుగో రోజూ విజయవంతంగా కొనసాగింది.


వినాయక చవితి పండుగ రోజున సైతం శిబిరానికి సెలవు ప్రకటించకుండా వైద్య సేవలు కొనసాగించడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నాలుగు రోజుల వ్యవధిలో 3,040 మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా,1,950 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.అవసరమైన 1,170 మందికి పైగా ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేయడంతో పాటు,కంటి శుక్లాల సమస్యతో బాధపడుతున్న 117 మందిని ఉచిత శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు.
నాలుగో రోజు విశేష స్పందన
నాలుగో రోజు 840 మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా,530 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు.కంటి సమస్యలను గుర్తించిన వారిలో 380 మందికి పైగా ఉచిత కళ్లద్దాలు అందజేశారు.కంటి శుక్లాల సమస్య ఉన్న 31 మందిని ఉచిత ఆపరేషన్లకు ఎంపిక చేశారు.ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కంటి సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేకపోవడం వల్ల వైద్యులను సంప్రదించకుండా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.


అలాంటి వారికి తమ ప్రాంతంలోనే నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఉచిత కంటి పరీక్షలతో సమస్యను ముందుగానే గుర్తించడంతో పాటు అవసరమైన వారికి వైద్యుల సలహాలు,ఉచిత కళ్లద్దాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.కంటి శుక్లాల సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి,వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నేటి నుంచి కంటి శుక్లాల ఆపరేషన్లు
ఇప్పటికే ఎంపిక చేసిన కంటి శుక్లాల బాధితులకు సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు విడతల వారీగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు రాఘవేందర్ రెడ్డి తెలిపారు.అలాగే సెప్టెంబర్ 16 వరకు ఉచిత కంటి పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.గ్రామీణ ప్రాంత ప్రజలు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,శిబిరానికి హాజరై ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తల్లోజు రఘు,ఎగిరిశెట్టి లింగం,రచ్చ శ్రీరాములు,నరేందర్ గౌడ్,జగన్,చంద్రశేఖర్,కొండల్ యాదవ్,రమేష్ యాదవ్,శ్రీపతి,శేఖర్,రఫీ,శ్రీను,మహేష్,భాస్కర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
