- టీయూడబ్ల్యూజేయూ (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్..
వనపర్తి: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించే నిరసన(Protest) కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణం గాంధీచౌక్‌లో గల గాంధీ విగ్రహం దగ్గర టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పట్టణ అధ్యక్షుడు తైలం అరుణ్ రాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తున్నప్పటికీ, వారి సమస్యలను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తరఫున నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులకు వృత్తిపరమైన భద్రత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల భద్రత కోసం మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


జర్నలిస్టులకు రక్షణ ఏది?..
విధి నిర్వహణలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధు గౌడ్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు, స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో జర్నలిస్టులు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారి భద్రతకు సంబంధించిన సమస్యలపై తగిన శ్రద్ధ లేకపోవడం ఆందోళనకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు అయినప్పటికీ మేనిఫెస్టోలో ఉన్న హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు జర్నలిస్టులకు ఇవ్వడం లేదని గుర్తు చేశారు.
ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే జర్నలిస్టులపై ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించే వాతావరణం కల్పించాలని కోరారు. వార్తా సేకరణ సమయంలో జర్నలిస్టులకు ఎదురయ్యే ఇబ్బందులు, విధి నిర్వహణలో భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల సమస్యలు కూడా ప్రజా సమస్యలుగానే పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి, వనపర్తి శాసనసభ్యులు మేఘా రెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం కు జర్నలిస్టు నాయకులు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు మద్దతుగా బీసీ పొలిటికల్ జేఏసీ, మహనీయుల స్ఫూర్తి వేదిక నాయకులు మద్దతు ప్రకటించారు.ఈ నిరసన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కౌన్సిల్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి , ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు, యూనియన్ నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
