- నల్గొండ జిల్లా దేవరకొండలో కలకలం..
- డెటాల్ తాగి 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
నల్గొండ జిల్లా, దేవరకొండ మండలం, పెంచికల్ పహాడ్‌లోని టీటీడబ్ల్యూఆర్ఆర్ఎస్ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి ఒక దారుణ సంఘటన కలకలం రేపింది. పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని మౌనిక డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విద్యార్థిని ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురుకులంలో నెలకొన్న వాతావరణమే ఆమె ఈ చర్యకు ప్రేరేపించిందా అనే కోణంలో చర్చ జరుగుతోంది.సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన గురుకుల సిబ్బంది హుటాహుటిన మౌనికను దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

కారణాలపై ఆరా…
పది తరగతి చదువుతున్న మౌనిక ఆకస్మికంగా ఇలా చేయడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. పాఠశాల ఒత్తిడి, సిబ్బంది వేధింపులు, లేక వ్యక్తిగత సమస్యలు కారణమా అనే కోణంలో విచారణ జరిపే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులను అడిగి పూర్తి వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది.గురుకులంలో ఈ తరహా ఘటన జరగడంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
