కాప్రా మండల పరిధిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు దమ్మాయిగూడకు చెందిన శారదాంబ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జవహర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రధానోపాధ్యాయుల సమక్షంలో జరిగింది.
ఈ విద్యా సంవత్సరంలో కాప్రా మండల స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులను సంఘం ప్రత్యేకంగా అభినందించింది. మండల ప్రథమ స్థానం సాధించిన గోరు యశస్విని కుషాయిగూడకు చెందిన విద్యార్థిని కాగా 560 మార్కులు సాధించింది. ద్వితీయ స్థానంలో ఎం సమన్విత 556 మార్కులతో నిలిచింది. తృతీయ స్థానంలో కాప్రాకు చెందిన ఆర్ సాకృష్ణ 550 మార్కులతో నిలిచారు.


మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి 2500 రూపాయల నగదు బహుమతి, సంఘ జ్ఞాపిక, పది దీర్ఘ నోట్ పుస్తకాలు అందజేశారు. ద్వితీయ స్థానం సాధించిన వారికి 2300 రూపాయల నగదు, సంఘ జ్ఞాపిక, పది నోట్ పుస్తకాలు అందించారు. తృతీయ స్థానం సాధించిన వారికి 2000 రూపాయల నగదు బహుమతి, సంఘ జ్ఞాపిక, పది నోట్ పుస్తకాలు ప్రదానం చేశారు.
అలాగే కాప్రా మండల పరిధిలోని ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతీ విద్యార్థికి వరుసగా 1200, 1100, 1000 రూపాయల నగదు బహుమతులతో పాటు సంఘ జ్ఞాపికలు, పది దీర్ఘ నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శారదాంబ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కాజా గంగాధరరావు, సభ్యులు జే వెంకటరమణ, సీనియర్ పౌరుల సంఘ ఉపాధ్యక్షులు మరియు సామాజిక కార్యకర్త ఉదయకుమార్ పాల్గొన్నారు. వీరు 16 మంది విద్యార్థులకు పది నోట్ పుస్తకాల చొప్పున అందజేసి సహకరించారు.
కార్యక్రమానికి ఇంచార్జి మండల విద్యాధికారి మరియు బాలాజీనగర్ ప్రధానోపాధ్యాయులు డి నరసింహ, జవహర్ నగర్ ప్రధానోపాధ్యాయులు ఎండి అజామొహిద్దీన్, చర్లపల్లి ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణ, కాప్రా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రాజగోపాల్, కుషాయిగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణాదేవి, వై రామేశ్వర్, ఎం రాజేష్, వాస కృష్ణ, జి ఆర్ రాజేందర్, మల్లిఖార్జునరావు, ఎం రాకేష్ సహా పలువురు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ సమావేశానికి హాజరైన విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
