ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం సీనియర్ సిటిజన్స్ రక్షణ కమిటీ నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ మామునూరి ఐలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వృద్ధుల రక్షణ, భద్రత మరియు వారి సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సమాజంలో వృద్ధుల రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పట్టణ మరియు గ్రామ పరిధిలోని వృద్ధులకు ఎదురవుతున్న సమస్యలను, వారి భద్రతా ఏర్పాట్లను ఈ సమావేశంలో సమీక్షించారు.
ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల వివరాలను సేకరించి, వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. కాలనీల్లో లేదా గ్రామాల్లో అపరిచిత వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.వృద్ధుల పట్ల ఎవరైనా వేధింపులకు గురిచేసినా, మోసాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీనియర్ సిటిజన్లకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసుల,ను సంప్రదించాలని సూచించారు.ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్ రక్షణ కమిటీ సభ్యులు, స్థానిక వృద్ధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
