- అతి వేగంగా భారత్ వైపు ప్రయాణం..
- భారత్ కి రెండు రెట్లు దిగుమతులు పెంచిన రష్యా..
చైనాకు క్రూడ్ ఆయిల్ రవాణా చేస్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ అనూహ్యంగా దారి మళ్లింది. భారత్ వైపు అది వేగంగా ప్రయాణిస్తున్నది. ఇరన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులను భారత్ రెండు రెట్లు పెంచడంతో ఈ పరిణామం జరిగింది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం ‘ఆక్వా టైటాన్’ అనే రష్యా చమురు నౌక జనవరి చివరలో బాల్టిక్ పోర్ట్‌లో క్రూడ్ ఆయిల్ లోడ్ చేసుకున్నది. చైనాలోని రిజావో పోర్టులో అన్‌లోడింగ్ కోసం బయలుదేరింది. కాగా, అమెరికా- ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది.
దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది. మరోవైపు దేశంలో ఇంధన సంక్షోభం నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులను భారత్ రెండు రెట్లు పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా వైపు వెళ్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ ‘ఆక్వా టైటాన్’ దారి మళ్లింది. దక్షిణ చైనా సముద్రంలో యూ టర్న్ తీసుకున్నది. భారత్ వైపు వేగంగా ప్రయాణిస్తున్నది. మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనున్నది.
కాగా, మరో రష్యా ట్యాంకర్ కూడా భారత్ వైపు తన మార్గాన్ని మార్చుకున్నది. కజఖ్ సీపీసీ బ్లెండ్ ముడి చమురును రవాణా చేస్తున్న సూయజ్‌మాక్స్ నౌక ‘జౌజౌ ఎన్’ భారత పశ్చిమ తీరంలోని సిక్కాను తన గమ్యస్థానంగా సూచిస్తున్నది. మార్చి 25న ఇది అక్కడకు చేరుకుంటుందని షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా తెలుస్తున్నది. అయితే ఇటీవల రష్యా ముడి చమురును చైనాకు రవాణా చేస్తున్న ఏడు ఆయిల్ ట్యాంకర్లు మార్గమధ్యలో ఇలా దారి మళ్లాయని ఇంధన నిఘా సంస్థ వోర్టెక్సా లిమిటెడ్ అంచనా వేసింది. భారత్‌లోని అన్ని ప్రధాన రిఫైనరీలు ఇప్పుడు రష్యా ముడి చమురు కోనుగోలుకు భారీగా ప్రయత్నిస్తున్నాయని వెల్లడించింది.
