- వెల్దుర్తి నుంచి శివంపేటకు అధికారి బదిలీ..
- శివంపేటలో రెగ్యులర్ ఉద్యోగి ఉన్నా అక్కడికే బదిలీ ఎందుకు?
- వెల్దుర్తిలో ఖాళీ పోస్టు ఉన్నా అటువైపు చూడని అధికారులు శిక్ష పడిందా? ప్రయోజనం జరిగిందా?
కౌడిపల్లి: కౌడిపల్లి మండల కేంద్రంలోని వెటర్నరీ ఆసుపత్రిలో అటెండర్‌తో వ్యక్తిగత కారు తుడిపించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న వెటర్నరీ డాక్టర్ పర్వీన్ ఫాతిమాపై చర్యలు తీసుకున్నట్లేనా? లేక బదిలీ పేరుతో ఆమెకు అనుకూలమే చేశారా? అన్న చర్చ ప్రస్తుతం మండలంలో సాగుతోంది. కౌడిపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ‘ఆదాబ్ హైదరాబాద’ దినపత్రికలో ‘వెటర్నరీ ఆసుపత్రిలో వెట్టిచాకిరి’(Aadab Hyderabad Effect) అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై స్పందించిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు సదరు ఉద్యోగినిని శివంపేట మండలానికి బదిలీ చేసినట్లు తెలిసింది.
అయితే, శివంపేటలో ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగి ఉండగా, ఆయన సెలవులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వెల్దుర్తిలో పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ సదరు అధికారిని అక్కడికి కాకుండా శివంపేటకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఖాళీగా ఉన్న వెల్దుర్తి పోస్టుకు బదిలీ చేయకుండా, ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగి (మాతృత్వ సెలవుపై ఉన్నారు) ఉన్న ప్రాంతానికే ఎందుకు పంపించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నివాస ప్రాంతానికి అనుకూలంగా ఉండే మండలానికి బదిలీ చేయడంతో శిక్ష పడకపోగా, ప్రయోజనమే కలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అటెండర్‌తో వ్యక్తిగత పనులు చేయించుకున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా, బదిలీతోనే వ్యవహారాన్ని ముగించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఉన్నతాధికారులు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, సదరు వెటర్నరీ అధికారిని వెల్దుర్తికి బదిలీ చేయాలని వెల్దుర్తి నాయకులు కోరుకుంటున్నట్లు తెలిసింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
