చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ‘మహాభారతం’(Mahabharata) హిందీ టీవీ సీరియల్ లో యోధుడు కర్ణుడి పాత్ర పోషించి అందరి మన్ననలు అందుకున్న పంకజ్ ధీర్(Pankaj Dheer) కన్నుమూశారు. ఆయన స్నేహితుడు అమిత్ బహల్ ఈ విషాద వార్తను ధ్రువీకరించారు. పంకజ్ చాలా ఏళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. శస్త్ర చికిత్సలు కూడా చేయించుకుని ఈ మహమ్మారిని జయించారు. కానీ కొన్ని నెలల క్రితం మళ్లీ ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే కన్నుమూశారు పంకజ్. బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. పంజాబ్‌కు చెందిన పంకజ్ ధీర్ 1980లో సినీ కెరీర్ ప్రారంభించి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. బీఆర్ చోప్రా ‘మహాభారత్’ టీవీ సీరియల్లో కర్ణుడి పాత్ర పోషించడంతో ఆయన పాపులారిటీ ఒక్కసారిగా పెరిగింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. మహాభారతంతో పాటు చంద్రకాంత (1994-1996), ది గ్రేట్ మరాఠా, ససురల్ సిమర్ కా లాంటి సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా సడక్, బాడ్షా, సోల్జర్ వంటి చిత్రాలలో కూడా కనిపించారు.
