- నీట్-యూజీ పేరుతో ప్రచార మాయాజాలం…
- తల్లిదండ్రులు మోసపోవద్దని విద్యార్థి నాయకుల హెచ్చరిక..
- నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్..
“ఒకరి బిడ్డను తమ బిడ్డగా చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు నెలకొంది.. ఎక్కడో వేరే రాష్ట్రంలో నీట్ యూజీ ఫలితాల్లో ఒక విద్యార్థికి మొదటి ర్యాంకు వస్తే.. ఆ విద్యార్థి తమ విద్యాసంస్థలో చదివాడని చెప్పుకోవటం సిగ్గుచేటు.. ఒక గౌరవనీయమైన స్థానంలో ఉన్న పెద్దమనిషి ఆధ్వర్యంలో నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలు ఇంతటి దిగజారుడు విద్యావ్యాపారం చేయడం వ్యవస్థను భ్రష్టుపట్టించడమే అవుతుంది..కనీస విద్యార్హత కూడా లేని ఆ పెద్దమనిషికి విద్యమీద అవగాహన ఉంటుంది అనుకోలేము..దయచేసి తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలి..భేషజాలకు పోయి మీ పిల్లల బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేయకండి..కష్టపడి సంపాదించింది ఇలా వృథా చేసుకోకండి..”
ఫస్ట్ ర్యాంకు రాకున్నా వచ్చినట్టు నీట్-యూజీ ఫలితాలను అడ్డుపెట్టుకుని నారాయణ విద్యాసంస్థలు విడుదల చేస్తున్న భారీ ప్రకటనలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి..పలు అనుమానాలకు కేంద్రబిందువుగా మారాయి. ఎందుకు అంటే అసలు ఫస్ట్ ర్యాంకు వచ్చింది పంజాబ్ రాష్ట్రంలోని ఒక వ్యక్తికి.. కానీ నారాయణ విద్యా సంస్థ మాత్రం తమ సంస్థలో చదవని విద్యార్థులను సైతం తమ ర్యాంకర్లుగా చూపిస్తున్నారు ? ఇలాంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి.
“ర్యాంకు ఎవరిది… ప్రచారం ఎవరిది?” అనే ప్రశ్నకు నారాయణ విద్యాసంస్థలు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.
వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును పక్కనపెట్టి, కొద్దిమంది ర్యాంకర్ల ఫోటోలతో కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులను ఆకర్షించడం విద్య కాదు… ఇది విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నమే!

నారాయణ విడుదల చేస్తున్న ప్రతి ర్యాంకు ప్రకటనపై ఈ వివరాలను బహిర్గతం చేయాలి :
- ఆ విద్యార్థి నిజంగా నారాయణలో ఎంతకాలం చదివాడు?
- పూర్తి అకడమిక్ కోర్సు అక్కడే పూర్తి చేశాడా?
- అదే విద్యార్థిని మరొక సంస్థ కూడా తమ ర్యాంకర్‌గా ప్రచారం చేస్తున్న సందర్భం నిన్నటి నీట్ యూజీ ఫలితాలు..
- ఆ ప్రకటనలకు ఆధారమైన ధృవపత్రాలు ఏమిటి?
ఈ వివరాలు వెల్లడించకుండా కేవలం భారీ హోర్డింగులు, టీవీ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారాలతో తల్లిదండ్రులను ఆకర్షించడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం, విద్యాశాఖ, వినియోగదారుల పరిరక్షణ అధికారులు నారాయణ విద్యాసంస్థల ప్రకటనలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి, ప్రకటనల్లో తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే సమాచారం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలి.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి:
మెరిసే ప్రకటనలను కాదు… నిజమైన ఫలితాలను నమ్మండి. ర్యాంకు ప్రకటన చూసి లక్షల రూపాయల ఫీజులు చెల్లించే ముందు, ఆ ర్యాంకు వెనుక ఉన్న వాస్తవాలను తప్పనిసరిగా తెలుసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు ఒక ప్రకటన కాదు… ఒక జీవిత నిర్ణయం.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాలి.. సదరు నారాయణ విద్యాసంస్థల అధినేత మంత్రి నారాయణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చి.. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు.. విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ.. కొన్ని పత్రికల్లో భారీ ఎత్తున ప్రకటనలు గుప్పిస్తున్నారు..

నారాయణ చేస్తున్న దాష్టీకాన్ని ప్రభుత్వాలు కూడా సమర్ధిస్తున్నాయంటే అతగాడు ఈమేరకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఏవిధంగా తన గుప్పిట్లో పెట్టుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు.. కనీసం ఏ నాయకుడు కూడా ఇది తప్పు అన్న పాపాన పోలేదు.. విద్యాశాఖ నుంచి ఒక్క ప్రకటన కూడా ఖండిస్తూ రాలేదంటే వ్యవహారం ఎంత పకడ్బందీగా నడుస్తోందో ఊహించవచ్చు.. విద్యను అడ్డగోలుగా అమ్ముకుంటూ.. విద్యార్థులను, అమాయకులైన వారి తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కావచ్చు లేదా ఆయనకు సంబంధించిన వారు కావచ్చు ఇలాంటి వారిని క్షమిస్తే.. పాలకులకు కూడా పాపం తగులుతుంది..
ఇన్ని దుర్మార్గాలు చేస్తూ, పిల్లి పాలు తాగుతూ కళ్ళుమూసుకున్నట్లు నారాయణ, ఆయన అనుచరులు కూడా ప్రవర్తిస్తున్నాఋ.. కానీ భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు.. ఆయన ఇవన్నీ చూస్తున్నాడని ఇంగితజ్ఞానం లేకపోవడం దురదృష్టం.. ఏది ఏమైనా ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతున్న వారికి సరైన గుణపాఠం జీవితమే నేర్పిస్తుంది.. అంతవరకు వేచి చూడక తప్పదు..
అయితే నారాయణ విద్యాసంస్థలు చేస్తున్న అరాచకా లను ఎప్పటికప్పుడు ‘ఆదాబ్ హైదరాబాద’ వెలుగులోకి తీసుకొ స్తూనే వుంది.. ప్రభుత్వాలను, అధికారులను అప్రమత్తం చేస్తూనే వుంది.. మరి ఫలితం మాత్రం కనిపించడం లేదు.. అయినా మా పోరాటాన్ని ఆపం.. న్యాయం అనేది జరిగేవరకూ అక్షర యుద్ధం చేస్తూనే ఉంటాం.. “మరిన్ని నారాయణ అరాచకాలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది..
