- కాంగ్రెస్ తో కలిసి మహిళా బిల్లును వ్యతిరేకించింది..
- బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ..
పశ్చిమ బెంగాల్‌లోని మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌తో కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మోదీ అన్నారు. బెంగాల్‌లోని బంకురలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. ‘‘పశ్చిమ బెంగాల్ మహిళలు తమకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారు.
2029 నుంచి ఇది అమలులోకి రావాలని కోరుకున్నారు. నేను కూడా ఇందుకు ప్రయత్నించా. కానీ, టీఎంసీ మాత్రం దీన్ని వ్యతిరేకించింది. పార్లమెంట్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి మహిళలకు టీఎంసీ వెన్నుపోటు పొడిచింది. బెంగాల్ ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకూడదని టీఎంసీ కోరుకుంటోంది.
వారి మహా జంగిల్ రాజ్యాన్ని అడ్డుకుంటారనే మమతా బెనర్జీ పార్టీ ఇదంతా చేస్తోంది. ప్రజలు జంగిల్ రాజ్యాన్ని ఓడించాలి. గిరిజనుల అభ్యున్నతి కోసం బీజేపీ పని చేస్తోంది. తొలిసారి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన పార్టీ బీజేపీ. ఈ రోజు ప్రపంచం అంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గౌరవిస్తోంది. కానీ, రాష్ట్రపతిని టీఎంసీ ప్రభుత్వం అవమానించింది.
ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనకు వచ్చినప్పుడు ఎలా అవమానించారో తెలుసు. ఈ చర్య ద్వారా గిరిజన తెగల్ని కూడా ఆ పార్టీ అగౌరవపరిచింది. టీఎంసీ నిత్యం గిరిజనుల్ని అవమానిస్తూనే ఉంది. రాష్ట్రపతిని అవమానించడాన్ని గిరిజనులు ఎప్పటికీ మర్చిపోరు. గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయిస్తాం. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే పేద మహిళలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ఉచితంగా డయాలసిస్ నిర్వహిస్తాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాలో ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.
