- సేవా సంకల్ప్ అభియాన్ సౌత్ ఇంచార్జ్ గా నియామకం..
- బీజేపీ, ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు..
ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar Yadav) యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం కీలకమైన ప్రాధాన్యాన్ని అప్పగించింది. ప్రధానమంత్రి మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలకు దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా ఆయనను నియమించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ, ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో విస్తృత ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ప్రజాసేవ, దేశాభివృద్ధి సహా ‘వికసిత్ భారత్–2047’ సంకల్పాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘ఆంగన్ కా ఉత్సవ్’, ‘కహానీ బద్లావ్ కి’, ‘సేవా జ్యోతి యాత్ర’ వంటి వినూత్న ప్రజా భాగస్వామ్య సేవలను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాల సమన్వయం, అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి సత్యకుమార్ దగ్గరుండి చూడనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరగనున్న రాష్ట్రవ్యాప్త వర్క్ షాప్ కు మంత్రి సత్యకుమార్ హాజరవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సేవా సంకల్ప్ అభియాన్‌ను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, వ్యూహాలపై ఆయన అక్కడ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
