- స్టేట్ ర్యాంకుల ముసుగులో విద్యార్థుల వేట
- ప్రకటనల్లో టాపర్లు.. గణాంకాల్లో గందరగోళం…
- 50% దాటని ఉత్తీర్ణతా శాతం..
- మెదక్ లోని ఆ రెండు కాలేజీలూ అంతే..
- ప్రత్యేక శ్రద్ధ అంటూనే “మందబుద్ధి”పై నీచ బుద్ధి..!
- ప్రైవేటు కాలేజీల నిగ్గు తేల్చిన ఇంటర్ ఫలితాలు
- విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలి
మెదక్ జిల్లాలో ప్రైవేటు జూనియర్ కాలేజీల పనితీరు మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. బయటకు స్టేట్ ర్యాంకులు సాధించినట్టు హడావిడి చేస్తున్న ఈ కాలేజీలు, వాస్తవానికి మొత్తం ఫలితాల్లో మాత్రం వెనుకబడుతున్నాయి. తాజాగా విడుదలైన ఫలితాలు చూస్తే, చాలా ప్రైవేటు కాలేజీలు కనీసం 50 శాతం ఉత్తీర్ణతను కూడా దాటలేకపోయిన విషయం స్పష్టమవుతోంది.
కొద్దిమంది టాపర్లను ముందుకు తెచ్చి “మా కళాశాల ర్యాంకులు” అంటూ ప్రకటనలు ఇవ్వడం ఈ కాలేజీల సాధారణ వ్యూహంగా మారింది. ఈ ప్రకటనలను నమ్మి తల్లిదండ్రులు, విద్యార్థులు చేరుతున్నా, మిగతా విద్యార్థుల ఫలితాలు మాత్రం నిరాశ కలిగిస్తున్నాయి. అంటే కొద్ది మంది ప్రతిభావంతులపై మాత్రమే దృష్టి పెట్టి, మిగిలిన వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

“ప్రత్యేక శ్రద్ధ” పేరుతో….
వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని కరపత్రాలలో ప్రింట్ వేసుకునే ప్రైవేట్ కళాశాలలు దానికి భిన్నంగా ర్యాంకులు తీసుకొచ్చే విద్యార్థులకే ప్రాధాన్యం ఇస్తూ, సాధారణ స్థాయి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని ఫలితాలను చూస్తే తేటతెల్లమవుతుంది. మందబుద్ధి గల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన కళాశాల యంత్రాంగం వారిపట్ల దృష్టి పెట్టడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కళాశాల ఉత్తీర్ణత శాతం పడిపోతున్నప్పటికీ, ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా కేవలం టాపర్లను మాత్రమే చూపిస్తూ కాలేజీలు తమ ప్రతిష్టను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
గణాంకాలను పరిశీలిస్తే ప్రకటనల్లో కనిపించే విజయం, వాస్తవ ఫలితాల్లో కనిపించడం లేదు. మెదక్ జిల్లాలోని కొన్ని కళాశాలల్లో 30 నుంచి 40 శాతం మధ్యే ఉత్తీర్ణత నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అయినప్పటికీ కరపత్రాలలో కళాశాల ఉత్తీర్ణతా శాతాన్ని ప్రకటించకుండా, ర్యాంకర్ల విజయాలనే పెద్దగా చూపించడం ద్వారా తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మలుస్తూ, ఫలితాల కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మేధావి వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రతి కాలేజీ పూర్తి ఫలితాలను వెల్లడించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, కేవలం ర్యాంకుల ఆధారంగా కాకుండా మొత్తం ఉత్తీర్ణత శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తల్లిదండ్రులు అడ్మిషన్ చేయించాలని పలువురు సూచిస్తున్నారు. కొద్దిమంది టాపర్లతో పేరు సంపాదిస్తూ, మిగతా విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం చూపెడుతున్న కళాశాలలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తానికి విద్యార్థులు కాలేజీ ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
మెదక్ లోని ఆ రెండు కాలేజీలు…
మెదక్ పట్టణ కేంద్రంలో ఉన్న రెండు ప్రైవేటు కళాశాలల విషయానికి వస్తే.. మొన్న విడుదలైన ఇంటర్ ఫలితాలలో గీతా జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరంలో 39 శాతం, ద్వితీయంలో 55 శాతం ఉత్తీర్ణత (సరాసరి 47 శాతం) సాధించగా.. సిద్ధార్థ ఆదర్శ కళాశాల కాస్త మెరుగ్గా ప్రథమంలో 56 ద్వితీయంలో 59 కలిపి సరాసరిగా 58 శాతం ఉత్తీర్ణత సాధించింది. అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతమే తక్కువ ఉండడం గమనార్హం.
