గుంటూరు జీజీహెచ్(Guntur GGH)లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ప్రభుత్వంలో, పాలనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా ఇది మాత్రం ప్రత్యేక ప్రోగ్రామ్ అని తెలిపారు. ఇంకా సమాజంలో మంచి మిగిలి ఉందనడానికి మీరంతా ఉదాహరణ అని పేర్కొన్నారు. 40, 50 ఏళ్ల క్రితమే మీరు విదేశాలకు వెళ్లినా.. జన్మభూమి(Janmabhumi)ని మర్చిపోకుండా, చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకున్నారని ప్రశంసించారు. 1981లోనే జింకానా ఏర్పాటుచేసుకొని ఇంత పెద్ద సాయం చేశారని, ఇందులోని ప్రతిఒక్కరికీ అభినందనలు అని అన్నారు.
సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
- మనమే కాదు. మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలనేది మన సంస్కృతి. ఎందరో ముందుకు వచ్చి పాఠశాలలకు, ఆస్పత్రులకు, ఆలయాలకు, సత్రాలకు, ఆట స్థలాలకు పెద్దఎత్తున విరాళాలు ఇచ్చారు.
- మన దేశంలో ఉన్న సంస్కృతీ, సంప్రదాయాలు మరే దేశంలో లేవు. అమెరికాలో 18 ఏళ్లకే పిల్లలు బయటకు వెళ్లి స్వతంత్రంగా జీవిస్తారు. పిల్లలు ఎంత పెద్దవారైనా జీవితాంతం తల్లిదండ్రులు మెంటర్ చేయడం మనది.
- నిర్మాణం కోసం మీరు రూ.100 కోట్లు ఖర్చు చేశారు. అంతేకాదు దాన్ని మెయింటైన్ చేయడం కోసం కొంత డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయడం గొప్ప విషయం.
- ఏపీలో మెడిసిన్ చేసిన ఎంతో మంది అమెరికా వెళ్లారు. నేను 1995లో సీఎం అయినప్పుడు చాలా మంది చదువుకొని అమెరికా వెళ్లిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతోందని కొందరు అడిగారు. రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని నేను అన్నాను.
- గుంటూరులో మిలీనియమ్ బ్లాక్ కోసం రూ.16 కోట్లు, విశాఖ ఏయూ మెడికల్ కాలేజీ సెంట్రియన్ బ్లాక్ కోసం రూ. 60 కోట్లు, కాకినాడ ఆస్పత్రికి రూ. 40 కోట్లు, కర్నూలు మెడికల్ కాలేజీకి రూ.20 కోట్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఖర్చు పెడుతున్నారు.
- ఆనాడు నేను పిలుపు ఇచ్చిన జన్మభూమి కార్యక్రమానికి ఎంతో మంది ప్రవాసులు సేవ చేశారు. ఇప్పుడు పీ4 కు పిలుపునిచ్చాం. కేంద్ర ప్రభుత్వం రహదారులు, ఎయిర్ పోర్టులు, విద్యుత్ రంగంలో వేగమైన అభివృద్ధికి పీ3 మోడల్ సరైన మార్గమని భావిస్తోంది.
- ఒకప్పుడు మన దేశంలో రహదారులు ఎన్ని ఉండేవో చూశాం. ఇప్పుడు జాతీయ రహదారుల నిర్మాణం ఎలా ఉందో చూస్తున్నాం. అయితే.. ధనిక, పేద మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి.
- నేను అందుకే పీ4 తీసుకొచ్చాను. మనందరం గ్రామీణ ప్రాంతాల్లో చిన్న కుటుంబాల్లో పుట్టాం. అవకాశాలను ఉపయోగించుకొని అంచెలంచెలుగా ఎదిగాం.
- మీరంతా సమాజానికి కొంత తిరిగి ఇస్తున్నారు. పేదలు రూ.10 సంపాదించుకునే అవకాశాలు వస్తేనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి.
- చదువు అనేది గేమ్ ఛేంజర్. అంబేద్కర్‌కు ఆనాడు బ్యాంక్ ఆఫ్ బరోడా రాజు ఆర్థిక సాయం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి మన దేశంపై చెరగని ముద్ర వేశారు. అబ్దుల్ కలాంకి అయ్యంగార్ సాయం చేశారు. బ్రాహ్మణులు ముస్లింలకు సాయం చేసేందుకు ఇష్టపడని రోజుల్లో కలాం ప్రతిభ చూసి ప్రోత్సహించారు. భారతరత్నకు మారుపేరుగా కలాం తయారయ్యారు.
- గుంటూరు మెడికల్ కాలేజీలో చదివినవారిలో 8 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. సీఎం అబీబుల్లా, సోమరాజు, రావు, నాయుడమ్మ, ప్రసాదరావు, నరేంద్రనాథ్, గోపీచంద్, గోపాలకృష్ణ గోఖలే సేవలకు పద్మశ్రీ వచ్చింది.
- నా లెక్క ప్రకారం మన ఆంధ్రా మెడికల్ కాలేజీ మొదటిదైతే గుంటూరుది రెండో మెడికల్ కాలేజీ అనుకుంటున్నాను.
- పేదరికం లేకుండా చేయాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలని మార్గదర్శి బంగారు కుటుంబాలు అనే విధానం తెచ్చాం. దీనికి 50 శాతం రీచ్ అయ్యాం. 10 లక్షల 42 వేల మందిని లక్షా 2 వేల మంది దత్తత తీసుకున్నారు. బంగారు కుటుంబాలు బాగుపడితే మార్గదర్శులుగా మారతారు. మీలో వీలైనంత మంది పేదలకు సాయం చేందుకు ముందుకు రావాలి.
- 2,69,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తుల అత్యాధునిక మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తంగా 600 బెడ్లు ఈ బ్లాకులో ఉన్నాయి.
- ప్రసూతి విభాగంలో 300 బెడ్లు, పిడీయాట్రిక్స్ విభాగంలో 200 బెడ్లు, NICU, SICU, PICU వంటి విభాగాల్లో మిగిలిన బెడ్లు ఉన్నాయి.
- డాక్టర్ గవిని ఉమాదేవి రూ.22 కోట్లు విరాళం ఇచ్చారు. అలాగే నళిని-వెంకట్ తేళ్ల రూ.8 కోట్లు, వాసిరెడ్డి రమాదేవి-కొండ్రగుంట వెంకట్రావు రూ.4.32 కోట్లు ఇచ్చారు.
- మొవ్వ వేదవతి-వెంకటేశ్వరరావు రూ.4.04 కోట్లు, డాక్టర్ తేలికిచర్ల-గుడిమెడ కుటుంబాలు రూ.3.60 కోట్లు, డాక్టర్ లక్ష్మీ-చౌదరి గంగ రూ.3.40 కోట్లు, బీనా నూతక్కి-గోపాలరావు రూ.3.20 కోట్లు ఇచ్చారు.
- కాలేజీ పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల వరకు సమకూర్చగా మోడ్రన్ హెల్త్ సెంటర్‌లో ఎక్విప్మెంట్, ఫర్నిచర్ నిమిత్తం ప్రభుత్వం రూ.27 కోట్లు కేటాయించింది.
- పూర్వ విద్యార్థులు ఈ బ్లాక్ నిర్మాణంతోపాటు గతంలో రూ.35 కోట్లను వెచ్చించి ఆడిటోరియం నిర్మించారు.
- డబ్బు ఉంటే సంతృప్తి రాదు. చాలా మంది సంపాదించినది మొత్తం పిల్లలకే ఇవ్వాలనుకుంటారు. ఇవ్వాలి. కానీ.. అదే సమయంలో కొంత భాగం సమాజానికి ఇవ్వాలి. అందులో ఉండే తృప్తి మరెందులోనూ రాదు.
- ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియా ఇటీవల కాలంలో అధిక గ్రోత్ ఉన్న దేశంగా మారింది. ప్రపంచంలో మనది 4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుంది.
- వికసిత్ భారత్ 2047 నాటికి ఇండియా ప్రపంచంలో నంబర్ వన్ కావాలన్నదే మన ఆకాంక్ష.
- ఈ 30 ఏళ్లలో ప్రపంచంలో ఎంతో అభివృద్ధి జరిగింది. టెక్నాలజీలో మార్పులు వచ్చాయి. నాడు ఐటీ.. నేడు ఏఐ వచ్చింది. అమెరికాలో సిలికాల్ వ్యాలీ ఉంది. మరి ఇండియాలో ఏముందని అడిగేవారి కోసం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఉందన్నది సమాధానం.
- ఆనాడు సైబరాబాద్ కట్టాం. నేడు క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు. ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకుంటున్నాం.
- అందుకే నేను ప్రోజ్యూమర్ అనే కొత్త కాన్స్పెన్ట్ తెచ్చాను. నాడు అసెంబ్లీలో కరెంట్ గురించే గంటల కొద్దీ చర్చలు జరిగేవి. అందుకే నాడు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం.
- విద్యుత్ రంగంలో మన దేశం నంబర్ వన్‌గా ఉండటం గర్వ కారణం. అమెరికాలో కూడా నాలుగు గ్రిడ్లు ఉన్నాయి. ప్రపంచంలో సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం మనదే. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీకి శ్రీకారం చుడుతున్నాం.
- ఇంకో పదేళ్లలో గుంటూరు సహా అమరావతి రూపురేఖలు ఎలా ఉంటాయో చూస్తారు.
- గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోతాయి. గుంటూరుకు182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. రెన్యువబుల్ ఎనర్జీతో పొల్యూషన్ అనేది ఉండదు.
- 1995లో నేను ఐటీని ప్రమోట్ చేశాను. 2000లో బయో టెక్నాలజీ ప్రమోట్ చేశాను. జీనోమ్ వ్యాలీకి భూములిచ్చాం. కొవిడ్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ జినామ్ వ్యాలీ నుంచి తయారుచేసింది.
- ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని పేరుతో కొత్త ప్రాజెక్టు తెస్తున్నాం. గేట్స్ ఫౌండేషన్ సహకరించేందుకు ముందుకొచ్చింది.
- కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశాం. 70 వేల మందికి క్లీనిక్ టెస్టులు చేశాం. చిత్తూరు జిల్లాలో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాం.
- ఈ ఏడాదిలోనే 28 జిల్లాలు పూర్తిగా సంజీవని ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డులు చేయడమే కాకుండా 72 లక్షల మంది రోగుల డేటా తీసుకుంటున్నాం.
- ఎవరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశంతోపాటు క్యాన్సర్, న్యూరో సమస్యలపై దృష్టి పెట్టాం.
- కార్పొరేట్ ఆస్పత్రులు ఫైవ్ స్టార్ హోటళ్లను మించాయి. చికిత్స ఖర్చు కంటే రూమ్ ఖర్చే ఎక్కువవుతోంది.
- 2026లోనే డ్రోన్ అంబులెన్స్ తీసుకురావాలని అనుకుంటున్నాం.
- Advertisement -
