- నవంబర్ 22 నుండి గూడెం సత్యనారాయణ స్వామి కార్తీక పౌర్ణమి జాతర(Jatara)
“శ్రీ రత్నగిరీశాయ గౌతమీ తీరవాసినే, ఆదినారాయణాయ శ్రీసత్య దేవాయ మంగళమ్”, తెలంగాణ ప్రాంతంలోనే అరుదైనదై, పవిత్ర గోదావరి నదీ తీరాన గుట్టపై వెలసి, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురికి 11కిలో మీటర్ల దూరాన మంచిర్యాల జిల్లా సరిహద్దున దండేపెల్లి మండలం గూడెం వద్ద భక్తుల పాలిటి వరదునిగా వాసి కెక్కిన సర్వజన బాంధవుడైన గూడెం రమా సహిత సత్యనారాయణ స్వామి కార్తీక పౌర్ణమి జాతర(Jatara) వేడుకలు నవంబర్ 22 నుండి అత్యంత వైభవంగా జరుగ నున్నాయి.
పూర్వము గూడెం గ్రామ వాస్తవ్యుడైన శ్రీ గోవర్ధన పెరుమాండ్ల స్వామి అనే చాత్తాద శ్రీ వైష్ణవునికి శ్రీ స్వామి, స్వప్న దర్శనం గావించి, మీగ్రామ శివారు రాట్నపు చెవులు కొండపై వెలిశాను అని చెప్పారట. అది స్వప్నమే కదా! అని విశ్వసించక మిన్నకుండి నాడట. కాని మరునాడు స్వప్నములో మళ్ళీ స్వామి రావడంతో… పెరుమాండ్ల స్వామి కొండ ఎక్కి, స్వామి వెలసిన చోటు కోసం వెతక నారంభించి తిరిగి తిరిగి ఎంత వెతికినా ‘జాడ తెలియక పోవడంతో సాయంత్రం ఇంటి కేగి నిద్రకు ఉపక్రమించగా, నీవుండే జాడ తెలుసుకునేంత జ్ఞానము నాకెక్కడిది స్వామి? నన్ను మన్నించి దర్శనమివ్వు! అని మనసులో తలచుకొని నిద్రించడం జరిగింది.

ఆ రాత్రి స్వప్నములో స్వామి అగుపించి ఆ కనపడుతున్న అదే రాట్నపు చెవుల కొండపై ఒక చిన్ననీటి కొలను (సారితే) దానికి దగ్గరగా ఉత్తర దిశలో ఉన్న గుహలో నేనున్నాను అని చెప్పి అదృశ్యమైనాడు. తెల్ల వారగానే ఆతృత పట్ట జాలక కొండపై వేగి కలలో అగుపించిన గుహలో వెదికితే, గుహలో చిన్న విగ్రహం దర్శన మిచ్చింది.
విగ్రహన్ని వెంటనే పెరుమాళ్లు పరుగున వెళ్ళి గోదావరిలో శుచిగా స్నానమాచరించి పూజా ద్రవ్యాలతో కొండ చేరుకొని విగ్రహమున్నచోట శుభ్రపరచి స్వామివారికి అభిషేకాదులు, పూజలు జరిపి నైవేద్యం పెట్టగా, విషయం తెలుసుకున్న . గ్రామ ప్రజలు కొండను చేరుకొని స్వామి దర్శనం చేసుకున్నారు. దైవ ప్రభావము చేత వారి కోరికలన్నియు తీరాయట. ఇలా కొండ పై దేవుడు వెలిశాడన్న వార్త ఊరూరా పాకి అందరూ దర్శనానికి రావడం మొక్కడము భక్తుల కోర్కెలు తీరడము, పెరుమాండ్లు ప్రతి రోజు స్వామి వారికి పూజాధికాలు, నిర్వహించడము ద్వారా స్వామి మహత్యము తొందరలో అందరికి తెలిసిపోవడము జరిగింది.
రోజులు గడిచిన కొలది శ్రీ పెరుమాండ్లు స్వామి ఆలోచించి శ్రీ సత్యనారాయణ స్వామి, రమాదేవి విగ్రహాలు పెద్దవి చేయించి భక్తుల సహకారముతో ఆలయ నిర్మాణము గావించి శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (1964) లో విగ్రహ ప్రతిష్ట చేశారు. కొండ పైకి వెళ్ళుటకై దారి, మంచి నీటి బావి త్రవ్వించారు. నాటి నుండి అసంఖ్యాక భక్తుల కోర్కెలు తీర్చుతూ శ్రీ స్వామి వారు నిత్య వినూత్న కళలతో వెలుగొందు చున్నాడు. ఈ దేవాలయము తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఏకైక శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయము.

కొండకు దాదాపు 1.కి.మీ. దూరాన పరమ పవిత్రమైన గోదావరి నది ప్రవహిస్తున్నది. భక్తులు అందు స్నానమాచరించి శ్రీ స్వామి వారిని దర్శించుకొనుట పరిపాటి. ఈ దేవస్థానములో ఎక్కువ సంఖ్యలో శ్రీ స్వామి వారి వ్రతమును చేసుకుంటారు. కుంకుమార్చనలు, అష్టోత్తరములు, అభిషేకము, హారతులు, ఇత్యాది అర్చనలు చేయించుకొని భక్తులు భగవదనుగ్రహ పాత్రులు అవుతున్నారు.
గోదావరి తీరాన ఒక గుట్టపై సత్యనారాయణ స్వామి, అదే ప్రాంతంలో పక్కన ఎత్తైన ప్రదేశంలో అయ్యప్ప స్వామి వెలసి, తెలంగాణలో అపర అన్నవరంగా, మరో శబరిమలైగా పెరిన్నకగన్న గూడెం గుట్ట విశేష ప్రాధాన్యత కలిగి ఉంది.
ఈ నెల 22నుండి 24వరకు కార్తీక పౌర్ణమి జాతర నిర్వహణకై దేవస్థానం వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, అర్చకులు, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాల నిర్వహణకై తగు ఏర్పాట్లు గావిస్తున్నారు.

మారహిత శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీన విష్వక్సేన ఆరాధన, పుణ్యహ వచనము, అంకురారోపణము, అగ్ని ప్రతిష్ఠ, నిత్య హవనము, బలిహరణం, తీర్ధప్రసాద వితరణ, గోధూళిక సమూహూర్తమున తులసీ కల్యాణం, 23న నిత్య హవనము, బలిహరణము, 24న కార్తీక పౌర్ణమి రోజున నిత్య హవనం, బలిహరణం, మహా పూర్ణాహుతి, యజ్ఞ పరి సమాప్తి, మహదాశీర్వచనం, తీర్థ ప్రసాదాల వితరణ తదితర ఉత్సవ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులు నడప నున్నారని ఈఓ శ్రీనివాస్ సంకటాల వివరించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
