- జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
నూతన విద్యా సంవత్సరంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. సోమవారం 2026-27 విద్యా సంవత్సరం తొలిరోజు
సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యను జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా భావించి కష్టపడి చదివి ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని తెలిపారు. పాఠశాలలోని తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా గది తదితర సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న విద్యా వాతావరణం, మౌలిక వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.


గ్రంథాలయాన్ని సందర్శించి విద్యార్థులు ప్రతిరోజూ పుస్తక పఠనానికి సమయం కేటాయించాలని, పాఠ్యపుస్తకాలతో పాటు సాధారణ విజ్ఞానం, స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవిత చరిత్రలు, సాహిత్య పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని విస్తరించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని పోటీ ప్రపంచంలో రాణించేందుకు సిద్ధం కావాలని తెలిపారు.
అనంతరం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అందజేశారు. విద్యా సంవత్సరపు మొదటి రోజు నుంచే క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని, ప్రతి రోజు నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యతో పాటు క్రీడలు, సహపాఠ్య కార్యకలాపాలలో పాల్గొని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల విద్యాధికారి, పంచాయతీ కార్యదర్శి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
