- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. చెన్నూర్ మండలం ఒతుకులపల్లి గ్రామానికి చెందిన కావేరి శోభ తన పేరు ఇందిరమ్మ మొదటి జాబితాలో వచ్చిందని, ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
మంచిర్యాల పట్టణానికి చెందిన సెగ్గెం ప్రసాద్ ఎస్.సి. కులానికి చెందిన నిరుపేద అయిన తనకు జీవనాధారంగా ఆటో, రెండు పడక గదుల ఇల్లు అందజేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన కట్ల పోసక్క, కట్ల పోచం లు గ్రామ శివారులో చేపట్టిన అక్రమ కల్వర్టు నిర్మాణంలో తమ భూమి ఆక్రమణ జరుగుతుందని, ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ కు చెందిన సత్యనారాయణ రావు తనకు జిల్లాలోని లక్షెట్టిపేట మండలం మోదెల గ్రామంలో గల భూమి గోదావరి నీటిలో మునిగిందని, ఈ విషయమై సమగ్ర విచారణ జరపి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.


జిల్లాలోని దేవాపూర్ కు చెందిన కాంపేలి వెంకటేశం తన కుమారుడికి లక్షెట్టిపేట మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన కళ్యాణి తనకు గృహజ్యోతి, గ్యాస్ రాయితీ పథకాలు వర్తింపచేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అంతకుముందు నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాలని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
