- విద్యార్థుల అభినందన సభలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
- కోట రెజోనెన్స్ జూనియర్ కళాశాల కరీంనగర్‌లో బ్రాండ్ ఇమేజ్.. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్‌లోని కోట ఇన్స్టిట్యూట్ వారి రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫలితాల ద్వారా రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టిందని, ఇది కరీంనగర్‌కు గర్వకారణమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్‌లోని రేకుర్తిలో గల కెపిఎస్ హైస్కూల్‌లో కోట రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు వచ్చిన సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
కరీంనగర్‌లో అనతి కాలంలోనే కార్పొరేట్ కళాశాలలను తలదన్నేలా గ్రామీణ ప్రాంతం నుండి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో, ఉత్తమ పౌరులుగా తయారు చేయాలనే సంకల్పంతో కోట విద్యాసంస్థలను స్థాపించిన చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ప్రపంచంలో చదువును మించిన ఆయుధం లేదని, కష్టపడి చదువుకున్న వారే ఉన్నత స్థానాలలో ఉన్నారని పేర్కొన్నారు. కోట విద్యాసంస్థలు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన అంజిరెడ్డి కరీంనగర్‌కు రాష్ట్రస్థాయిలో కీర్తి తీసుకురావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఫలితాలు రావడానికి ఇంకా సమయం పడుతుందని అనుకున్నా, యజ్ఞంలా కృషి చేసి త్వరగా ఫలితాలు సాధించడం అభినందనీయం అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి విజయ పరంపర కొనసాగించాలని కోరారు. కోట ఇన్స్టిట్యూట్ ఇప్పుడు కరీంనగర్‌లో బ్రాండ్ ఇమేజ్‌గా మారిందని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో కరీంనగర్ ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడానికి కోట విద్యాసంస్థలు బాటలు వేసాయని అన్నారు. ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ, కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి యొక్క క్రమశిక్షణ అతనిని బ్రాండ్ ఇమేజ్‌కు దగ్గరగా తీసుకెళ్లిందని అన్నారు.కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి మాట్లాడుతూ, ఇక్కడి విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్మార్ట్ క్లాస్ విద్యా విధానం ద్వారా స్థానికంగానే నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో కోట విద్యాసంస్థలను స్థాపించామని తెలిపారు. తొలి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి మార్కులు సాధించడం గర్వకారణమని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందం ఇచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని సంచలన విజయాలు సాధిస్తామని తెలిపారు.
రాష్ట్రస్థాయిలో ఫస్ట్ మార్కులు సాధించిన విద్యార్థులు: ప్రథమ సంవత్సరం ఎంపీసీ గాలి సౌమ్యశ్రీ (469), ద్వితీయ సంవత్సరం కే సహన శ్రీ (995), ద్వితీయ సంవత్సరం బైపీసీ జి రోషిని (993), బైపీసీ ప్రథమ సంవత్సరం పి శరణ్య (438)లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు పూల గుచ్ఛాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
