కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా విధులు నిర్వహించిన ఎస్.ఐ టీ. నరేష్, ఏఎస్ఐ రెనుకానందం మహిళా కానిస్టేబుల్ శ్రవంతి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి, ఎస్ఐ శ్రీ లక్ష్మారెడ్డి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని, బదిలీపై వెళ్తున్న అధికారులను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సీఐ ఎ. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, బదిలీపై వెళ్తున్న అధికారులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అప్పగించిన ప్రతి విధిని సమర్థవంతంగా, అంకితభావంతో నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. విధి నిర్వహణలో వారి నిబద్ధత, క్రమశిక్షణ, తోటి సిబ్బందితో కలిసి మెలిసి పనిచేసిన తీరును ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ భావోద్వేగపూర్వకంగా వీడ్కోలు పలికి, వారు కొత్త విధి నిర్వహణ ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన సేవా భావంతో ప్రజలకు సేవలందిస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
