- పహల్గాం దాడి జరిగి నేటికీ ఏడాది..
- ఆంక్షలమధ్య పర్యాకుల సందర్శన..
పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్‌లో మళ్లీ పర్యాటకం ఊపందుకుంది. గత ఏడాది పహల్గాం దాడి తర్వాత ఈ ప్రాంతంలో పర్యాటకం నెమ్మదిగా దెబ్బతింది. కానీ, ఇప్పుడు మళ్లీ పర్యాటక రంగం దూసుకెళ్తోంది. కాశ్మీర్‌లోని పహల్గాం దాడి జరిగి నేటికి ఏడాది. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలోని పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. కాల్పులు జరిపి 26 మందిని హతమార్చారు. దీంతో అప్పటినుంచి ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయింది. దాడి అనంతరం మొత్తం 48 ప్రాంతాలను అధికారులు మూసేశారు. వాటిలో ఒక్కోటి నెమ్మదిగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ 48 పర్యాటక కేంద్రాల్లో 39 తిరిగి తెరుచుకున్నాయి.
ఘటన జరిగిన సమయంలో అక్కడికి భద్రతా దళాలు 25 నిమిషాల తర్వాత చేరుకున్నాయి. అయితే, ఇప్పుడు ఈ మార్గం మొత్తం సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పహల్గాం నుంచి అక్కడి ప్రధాన టూరిస్ట్ కేంద్రమైన బైసరన్‌కు ఐదు కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రదేశంలో ఇప్పుడు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు స్థానిక పోలీసులు ఇప్పుడు 24 గంటలపాటు కాపలా కాస్తున్నారు. మరోవైపు మారిన పరిస్థితుల నేపథ్యంలో పర్యాటకులు తరలివస్తున్నారు. కొన్ని ఆంక్షలున్నప్పటికీ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.
స్థానిక వ్యాపారం కూడా పుంజుకుంది. హోటళ్లు, షాపులు మళ్లీ కళకళలాడుతున్నాయి. టౌన్ ఎంట్రీ వద్ద టోల్ ఫీజులు కూడా భారీగా వసూలవుతున్నాయి. గత మార్చి నుంచి ఇక్కడి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఇటీవలి కాలంలో ఇక్కడి టులిప్ గార్డెన్‌కు సందర్శకులు భారీగా పెరిగారు. ఈ సీజన్‌లో మొత్తం 1.8 మిలియన్ టులిప్ పూలు పూశాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు తరలివచ్చారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి గార్డెన్ మూసేసేవరకు 2,52,000 మంది సందర్శించారు.
