- అన్ని వర్గాల రక్షణే నా ధ్యేయం..
- బషీరాబాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా కవిత ప్రకటన..
తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ శక్తిగా ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)ను ఆవిష్కరిస్తూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడిన ఆమె, రాష్ట్రంలోని అన్ని వర్గాల రక్షణే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కవిత స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలకు ‘అమ్మలా’ ఆలోచించే హృదయం లేదని కవిత విమర్శించారు. “నేను అమ్మలా పరిణితి చెందుతానని అంటే చాలా మంది ఎగతాళి చేశారు. కానీ అమ్మలా లాలించి పాలన చేసినప్పుడే ప్రజలకు అసలైన న్యాయం జరుగుతుంది” అని ఆమె స్పష్టం చేశారు.
సామాన్యుడి ఆదాయంలో 60 శాతం విద్య, వైద్యానికే ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేసిన కవిత, తమ పార్టీ అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా వారు ఎంత వరకు చదువుతారో అంత వరకు పూర్తి ఉచిత విద్యను అందిస్తామని, దీనికి సంబంధించిన ఆర్థిక ప్రణాళిక తమ వద్ద సిద్ధంగా ఉందని వెల్లడించారు.
