- కోర్టుకు వెళ్లిన బీ.ఆర్.ఎస్. నేత సుధాకర్ రెడ్డి..
- పదెకరాల్లో చెరువు ఉందన్న హైడ్రా రంగనాథ్..
బతుకమ్మకుంటలో అసలు చెరువులేదని బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టుకు వెళ్లారని, కానీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అక్కడ పదెకరాల్లో చెరువు ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంట చెరువును పునరుద్ధరించడంపై ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. దీనిపై రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ, చెరువు భూమికి తానే యజమానిని అని, అక్కడ వ్యవసాయం కూడా చేశామని సుధాకర్ రెడ్డి చెబుతున్నారని తెలిపారు.
కానీ అసలు చెరువులో ఉన్న భూమికి పట్టాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చెరువును పూడ్చి కూడా వ్యవసాయం చేయవచ్చని అన్నారు. అలా చేసినంత మాత్రాన చెరువుకు యజమాని అయిపోరు కదా అని వ్యాఖ్యానించారు. చెరువు ఉన్న ప్రాంతంలో నిరుపేదలు ఉంటే వారిని ఖాళీ చేయించి, వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని అన్నారు. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని తెలిపారు.
