- 50 మంది విద్యార్థులు పస్తులు
- హెచ్చరికలు.. ఆదేశాలు బేఖాతర్!
- కడ్తాల్ పీఎం శ్రీ జెడ్పీ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై తీవ్ర ఆరోపణలు
- విద్యా కమిషన్ సభ్యుల ఆదేశాలూ బేఖాతర్..
- ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడిన మధ్యాహ్న భోజన పథకం అమలులో అధికారుల పర్యవేక్షణ లోపం మరోసారి వెలుగులోకి వచ్చింది.రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీ బాలుర పాఠశాలలో మాడిన అన్నం,నీళ్ల పప్పు వడ్డించడంతో సుమారు 50 మంది విద్యార్థులు భోజనం చేయకుండా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.గతంలోనే మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం నిబంధనలు పాటించాలని,భోజనం నాణ్యతపై ఫిర్యాదులు రావడం,‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రికలో కథనాలు ప్రచురించడం,విద్యా కమిషన్ సభ్యులు స్వయంగా పాఠశాలను సందర్శించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగినప్పటికీ మళ్లీ ఇదే పరిస్థితి నెలకొనడంపై తల్లిదండ్రులు,స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ మొదటికొచ్చిన మధ్యాహ్న భోజనం వ్యవహారం
పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై గతంలోనే తల్లిదండ్రులు,స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.భోజనం నాణ్యత సరిగా లేదని,విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు తగిన స్థాయిలో చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ విషయాన్ని ‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రిక సైతం గతంలో కథనాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.అయినప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
విద్యా కమిషన్ సభ్యుడి తనిఖీ.. ఆదేశాలు సైతం
విద్యార్థుల మధ్యాహ్న భోజన సమస్యపై విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ పాఠశాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించినట్లు స్థానికులు తెలిపారు.అనంతరం సంబంధిత అధికారులకు,డీఈవోకు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ,కొద్ది కాలానికే మళ్లీ నాణ్యత లేని భోజనం వడ్డించడంపై వారు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినా క్షేత్రస్థాయిలో అమలు ఎందుకు కావడం లేదు? మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు ఏ మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నారు? గత ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి.

మాడిన అన్నం.. నీళ్ల పప్పు
బుధవారం పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన భోజనం మాడిపోయి ఉండటంతో పాటు పప్పు నీళ్లలా ఉండడంతో విద్యార్థులు భోజనం చేయడానికి ఆసక్తి చూపలేదని తల్లిదండ్రులు తెలిపారు.దీంతో సుమారు 50 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా పస్తులుండాల్సి వచ్చిందని పేర్కొన్నారు.విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన పథకంలోనే నాణ్యత లేని భోజనం అందించడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.భోజనం తినలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎంఈవో,డీఈవోతో పాటు సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా పాఠశాలను తనిఖీ చేయాల్సి ఉండగా,క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సరిగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.అధికారులు కేవలం ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే స్పందించకుండా,ప్రతిరోజూ విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతపై పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.వంటశాల పరిశుభ్రత,వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యత,వండిన ఆహారం నాణ్యత,విద్యార్థులకు సరిపడా భోజనం అందుతున్నదా లేదా అనే అంశాలను అధికారులు నిరంతరం పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

స్థానికుల ఆగ్రహం..
అధికారులకు సమాచారం
విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందుతున్న విషయం తెలుసుకున్న కడ్తాల్ మాజీ ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ,సాలార్‌పూర్ నాయకులు ప్రియా రమేష్,యువకులు,స్థానిక నాయకులు స్పందించారు.పాఠశాలలో నెలకొన్న పరిస్థితిపై సంబంధిత అధికారులకు సమాచారం అందించి,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సాలార్ పూర్ వార్డు సభ్యులు దశరథ్,దస్రు,రాజు,గోపాల్,జగన్,చందు,నాయకులు పకీరా నాయక్,కాడియా మోహన్,రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పాఠశాలలో విద్యార్థులకు మాడిన భోజనం,నాణ్యత లేని పప్పు వడ్డించిన ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు,స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఘటనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అదేవిధంగా గతంలో విద్యార్థులు,తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులు, ‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రికలో వచ్చిన కథనాలు,విద్యా కమిషన్ సభ్యుల తనిఖీ అనంతరం ఇచ్చిన ఆదేశాల అమలుపై కూడా ఉన్నతాధికారులు సమీక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం వద్దు
మధ్యాహ్న భోజనం పథకం లక్ష్యం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమేనని,అలాంటి పథకంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తే విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు.ఇకనైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కోరారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు,భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
