ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిన జవహర్ నగర్ రాంకీ చెత్త డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బాలాజీనగర్ దళిత సంక్షేమ భవన్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీని ఏర్పాటు చేశారు.
సమావేశానికి ఇఫ్టూ షేక్ షావలి, ఏఐఎఫ్‌టీయూ వై. మల్లేష్, ఐఎఫ్‌టీయూ శివబాబు, టీయూసీఐ వి. ప్రవీణ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో సిపిఐ మాజీ ఎంపీటీసీ తోటపల్లి శంకర్, సిపిఎం శివన్నారాయణ, బీఎస్పీ బిర్రు యాకస్వామి, మాజీ మేయర్ మేకల కావ్య, బీఆర్ఎస్ కొండల్ ముదిరాజ్, ఆలూరి రాజశేఖర్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి, తెలంగాణ రక్షణ సేన లలిత యాదవ్, తెలంగాణ జనసమితి భద్రగామి అంజనేయులు, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అనురాధ, జయసుద, సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ గడ్డం సదానందం, ముస్లిం కమిటీ పాషామియా, బహుజన సత్త సింగరాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో భవిష్యత్ కార్యాచరణలో భాగంగా డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవ సలహాదారులుగా మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఆర్. నర్సింహ్మ గౌడ్, కల్లెపల్లి సదానందంను నియమించారు. కమిటీ చైర్మన్‌గా ఇఫ్టూ షేక్ షావలి, కన్వీనర్‌గా సిపిఐ ఉమామహేష్, కోశాధికారిగా శివబాబు, కో కన్వీనర్లుగా మేకల కావ్య, కొండల్ ముదిరాజ్, ఆలూరి రాజశేఖర్, శివన్నారాయణ, లలిత యాదవ్, అంజనేయులు, అనురాధ, గడ్డం సదానందం, వై. మల్లేష్, ప్రపుల్ రాంరెడ్డి, పాషామియా, సింగరాయ గౌడ్, యాకస్వామిలను ఎన్నుకున్నట్లు నిర్వాహక కమిటీ ప్రకటించింది.
ప్రజాసంఘాలు, కుల సంఘాలు, బస్తీ సంఘాలు, సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు కమిటీ సభ్యులుగా కొనసాగుతారని తెలిపారు. గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డును వెంటనే ఎత్తివేయాలని, జవహర్ నగర్ పరిధిలోని బస్తీలలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, వంద పడకల ఆసుపత్రి వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు.
డంపింగ్ యార్డు సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పోరాట కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ప్రజా ఆందోళనలు చేపడతామని, ఆ పరిస్థితులకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని సమావేశంలో పలువురు నాయకులు హెచ్చరించారు.
