Friday, January 16, 2026
EPAPER
Homeఅంతర్జాతీయంInd-Pak | అణు కేంద్రాల జాబితాల పరస్పర మార్పిడి

Ind-Pak | అణు కేంద్రాల జాబితాల పరస్పర మార్పిడి

ఇండియా(India), పాకిస్తాన్(Pakistan) గురువారం తమ అణు కేంద్రాల జాబితాల(List of Nuclear Installations)ను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. అణు స్థావరాలు, సౌకర్యాలపై ఒకరికొకరు దాడి చేసుకోకుండా నిషేధించేందుకు కుదిరిన ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఈ వివరాలను పంచుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(Ministry of External Affairs-MEA) తెలిపింది. ఈ రెండు దేశాలు మూడు దశాబ్దాలకు పైగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాయి. 2025 మే నెలలో 4 రోజుల సైనిక ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలోనూ ఈ కార్యక్రమం జరగటం గమనార్హం.

న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలోని దౌత్య మార్గాల ద్వారా ఏక కాలంలో ఈ జాబితాల మార్పిడి జరిగింది. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం 1988 డిసెంబర్ 31న జరగ్గా 1991 జనవరి 27న అమల్లోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం ప్రతి క్యాలెండర్ సంవత్సరం జనవరి మొదటి తేదీన.. ఒప్పందం పరిధిలోకి వచ్చే అణు స్థావరాల, సౌకర్యాల గురించి రెండు దేశాలు పరస్పరం తెలియజేయాలి. రెండు దేశాల మధ్య ఈ జాబితాల మార్పిడి తొలిసారి 1992 జనవరి 1న జరగ్గా ఇది వరుసగా 35వ సారి అని ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News