- గిరిజన బాలిక మృతిపై అనుమానాలు…
- కుటుంబ సభ్యులకు చెప్పకుండానే ఇంటికి మృతదేహం తరలింపు ప్రయత్నం…
- హుజూర్‌నగర్‌లో(Huzurnagar ) తీవ్ర ఉద్రిక్తత…అర్థరాత్రి వరకు రాస్తారోకో…
హుజూర్నగర్: సూర్యాపేట జిల్లాలో సర్కార్ వైద్యం ప్రాణాలు బలిగొందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.వైద్యుల నిర్లక్ష్యంతోనే ఓ గిరిజన బాలిక ప్రాణాలు కోల్పోయిందంటూ కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.మృతురాలి బంధువులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని తరలించడం ఉద్రిక్తతకు దారితీసింది.పూర్తి వివరాల్లోకి వెళితే…సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నక్కగూడెం తండాకు చెందిన గిరిజన బాలిక మల్లేశ్వరి (12) గత ఐదు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.
కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్‌లోని(Huzurnagar ) ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.అక్కడ నాలుగు రోజుల పాటు వైద్యం అందించినప్పటికీ బాలిక ఆరోగ్యం కుదుటపడలేదు.పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సూర్యాపేటకు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు.అయితే మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఆగ్రహంతో రగిలిపోయిన బంధువులు…ప్రధాన రహదారిపై మెరుపు ధర్నా
చిన్నారి మృతి ఒక ఎత్తైతే అసలు తమకు ఎలాంటి సమాచారం తెలపకుండానే అంబులెన్స్ సిబ్బంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మృతదేహాన్ని హుటాహుటిన తరలించే ప్రయత్నం చేయడంపై బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆసుపత్రి సిబ్బంది,అధికారుల తీరుపై మండిపడ్డారు.ఈ ఘటనకు నిరసనగా శనివారం రాత్రి హుజూర్‌నగర్‌లోని ప్రధాన కూడలైన ఇందిరా సెంటర్ వద్ద బంధువులు,స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.మృతదేహంతో రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అర్ధరాత్రి వరకు ఈ ఆందోళన కొనసాగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.పోలీసులు రంగ ప్రవేశం చేసి వాహనాలను వేరే మార్గంలో మళ్ళించారు.ఈ సందర్భంగా బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడుతూ బాలిక మృతికి గల కారణాలను వైద్య శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.అదే విధంగా ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు అందించిన వైద్యంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని తెలిపారు.అంతే కాకుండా బాలిక మృతదేహాన్ని రహస్యంగా తరలించడానికి యత్నించిన అంబులెన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై సంబంధిత వైద్య,పోలీసు అధికారులు అధికారికంగా ఏవిధంగా స్పందిస్తారనే ఆసక్తికరంగా మారింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
