- తీవ్ర వ్యాసఖ్యలు చేసిన హరీష్ రావు..
- సిగాచీ బాధితుల పరిష్కారం ఎప్పుడిస్తారు..?
సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. నాడు కోటి రూపాయల సాయం అంటూ సిగాచి బాధితులను నమ్మబలికి అందులో సగం కూడా వారికి చేర్చని రేవంత్ రెడ్డి నయవంచనలో తనను మించినవారు లేరని నిరూపించుకున్నారని అన్నారు. ఆ పూటకు మాటలు చెప్పడం.. ఆ తర్వాత తాను చెప్పిన మాటలకే విలువ ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డికే చెల్లిందని విమర్శించారు. సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే, ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయని హరీశ్‌రావు అన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ.. మృతదేహాల సాక్షిగా ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారని తెలిపారు. కానీ ఇదంతా కంటితుడుపు చర్యే అని, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో తేటతెల్లమైందని పేర్కొన్నారు. మాట ఇచ్చి తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శమని వ్యాఖ్యానించారు.
