- అందరికీ ఇష్టమైన దేవుడు ఆంజనేయుడు..
- అనేక రూపాల్లో భక్తుల కోరికలు తీరుస్తాడు..
హిందూ ధర్మంలో హనుమంతుడు అంటే చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఇష్టమైన దేవుడు. ఆపదలోనైనా, ఆందోళనలోనైనా, భయ సమయంలోనైనా హనుమంతుడిని స్మరించమని మన పెద్దలు చెబుతారు. అపారమైన శక్తి, అచంచలమైన భక్తికి ప్రతీకగా నిలిచిన ఆంజనేయస్వామి అనేక రూపాల్లో భక్తుల కోరికలను తీర్చేవాడిగా పూజలు అందుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా ఆయనకు అనేక ఆలయాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక ఆచారాలతో విశేష ప్రాధాన్యం సంపాదించాయి.
అలాంటి ఓ ప్రత్యేక హనుమ క్షేత్రం గురించి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లా పరిధిలో ఉన్న బిబడోడ్ గ్రామంలో వెలసిన హనుమాన్ ఆలయం విశేషమైన సంప్రదాయంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని స్థానిక భక్తులు కలిసి నిర్మించారు. అనంతరం వారు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించగా, ఆ యజ్ఞం కోసం సమకూరిన విరాళాల్లో కొంత భాగాన్ని వినియోగించి, మిగిలిన నిధులను సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్ణయించారు.
ఆ ఆలోచనలో భాగంగా, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఆలయ నిధుల నుంచి రుణాలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ రుణాలను తీసుకున్నవారు తమ వ్యాపారాల్లో అభివృద్ధి సాధించి, తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించడంతో ఈ విధానం విశ్వసనీయంగా మారింది. క్రమంగా “హనుమ నుంచి అప్పు తీసుకుంటే వ్యాపారంలో విజయం సాధ్యం” అనే నమ్మకం గ్రామమంతట వ్యాపించింది. పేదలే కాదు, ఆర్థికంగా బలమైనవారు కూడా ఈ విధానాన్ని అనుసరించడం ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులు ఈ రుణాలపై స్వల్ప వడ్డీ తీసుకుంటూ, ఆ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, నిర్వహణ కోసం వినియోగిస్తున్నారు.
ఈ విశేషం గురించి తెలిసిన అనేక మంది భక్తులు, వ్యాపారులు ఇప్పుడు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. కొందరు రుణం కోసం వస్తుండగా, మరికొందరు కేవలం స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని కూడా విశ్వాసం ఉంది. ఇది ఒక విశేషమైన సామాజిక-ఆధ్యాత్మిక ప్రయత్నమని చెప్పవచ్చు.
