- 1 లక్ష మార్క్ నుండి దిగిరానుందా?
- దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ..
- జూన్ నెలాఖరు నాటికి భారీగా తగ్గుదల..
- మధ్య ప్రాచ్యంలో చల్లబడుతున్న ఉద్రిక్తతలు..
- సేఫ్ హేవెన్’ నుండి ఈక్విటీల వైపు పెట్టుబడులు..
- పుకార్లను నమ్మొద్దు అంటున్న నిపుణులు..
ప్రస్తుతం దేశంలో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, మార్కెట్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జూన్ నెలాఖరు నాటికి 10 గ్రాముల బంగారం ధర భారీగా దిగివచ్చే అవకాశం ఉందంటూ ఆర్థిక వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలే దీనికి ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరల్లో ఊహించని మార్పులు తీసుకురాగల ఆ కీలక పరిణామాలను నిపుణులు ఇలా సూచిస్తున్నారు.. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఇరాన్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అక్కడ నిలిచిపోయిన ఆయిల్ ట్యాంకర్ల సరఫరా పునఃప్రారంభమైతే, ప్రపంచ మార్కెట్‌కు ముడి చమురు వెల్లువలా వస్తుంది. ఫలితంగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 60–70 డాలర్ల స్థాయికి పడిపోవచ్చని అంచనా. చమురు ధరలు తగ్గితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గి, మార్కెట్లు స్థిరపడతాయి.
సాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి భారీగా కొనుగోలు చేస్తారు. అయితే, ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు కూడా శాంతి చర్చల వైపు అడుగులు వేస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ప్రభావం: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే, ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం నుండి తమ పెట్టుబడులను లాభసాటిగా ఉండే ఈక్విటీలు అంటే షేర్ మార్కెట్, ఇతర రంగాల వైపు మళ్లించే అవకాశం ఉంది.

ఇది బంగారంపై డిమాండ్‌ను తగ్గిస్తుంది. గత కొన్ని నెలలుగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, తక్కువ ధరలో కొనుగోలు చేసిన పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇప్పుడు లాభాలను వెనకేసుకునే ఆలోచనలో ఉన్నారు. మార్కెట్‌లో పెద్ద ఎత్తున పసిడి అమ్మకాలు ప్రారంభమైతే, డిమాండ్ తగ్గి ధరలు మరింత వేగంగా కిందకు దిగివస్తాయి. జూన్ నెలలోనే 10 గ్రాముల బంగారం ధర ఖచ్చితంగా భారీగా పడిపోతుందని బ్లైండ్‌గా నమ్మడం తొందరపాటే అవుతుందని మరికొందరు సీనియర్ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బంగారం ధరలను కేవలం యుద్ధాలు మాత్రమే కాదు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు: వడ్డీ రేట్ల తగ్గింపు లేదా పెంపు. డాలర్ ఇండెక్స్: అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ బలం. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు నిల్వల కోసం చేసే కొనుగోళ్లు కూడా ధరలను నిర్ణయించే అవకాశం ఉంది.. సోషల్ మీడియాలో వచ్చే విశ్లేషణలు, పుకార్లను మాత్రమే నమ్మి ఆత్రుతగా నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక మార్కెట్ ధోరణులను, ఆర్థిక నిపుణుల ప్రామాణిక నివేదికలను పరిశీలించిన తర్వాతే బంగారంపై పెట్టుబడుల విషయంలో ముందడుగు వేయడం ఉత్తమం వారు హెచ్చరిస్తున్నారు..
- బీ.వీ.ఆర్. రావు..
