- ఓ చిన్నారిని కడుపులో తన్నిన వైనం..
- సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
చైనాలోని ఓ బొటానికల్ గార్డెన్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు రోబోల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది. వినోదం కోసం ఏర్పాటు చేసిన ఓ హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శన ఇస్తుండగా, అకస్మాత్తుగా ఓ చిన్నారిని కాలితో తన్నడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, యంత్రాలతో వ్యవహరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో ఉన్న ఉరుమ్కి బొటానికల్ గార్డెన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ వీడియో ప్రకారం, ఆఫ్రో స్టైల్ విగ్గు ధరించిన ఓ రోబో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తోంది. చుట్టూ ఉన్న చిన్నారులు, పెద్దలు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో, ఆ రోబో వేగంగా తిరిగి ఒక రౌండ్‌హౌస్ కిక్ ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో దానికి దగ్గరగా నిల్చుని చూస్తున్న ఓ బాలుడి పొట్టలో ఆ కిక్ బలంగా తగిలింది. దీంతో ఆ బాలుడు నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే పక్కనున్న మరో బాలుడు అతడిని వెనక్కి లాగాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. అయితే, బాలుడికి తీవ్ర గాయాలేమీ కాలేదని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా వ్యాపించడంతో, నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘యంత్రం తప్పు చేస్తే దానికి బాధ్యులు ఎవరు?’ అనే ప్రాథమిక ప్రశ్నను చాలామంది లేవనెత్తారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హింసకు పాల్పడే టెర్మినేటర్ తరహా దృశ్యం కాదని, కేవలం భద్రతా ప్రమాణాలను విస్మరించడమే అసలైన సమస్య అని కొందరు అభిప్రాయపడ్డారు.
