గురువారం న్యూఢిల్లీలోని భారత్ మండపం హాల్ నం.14లో నిర్వహించిన భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్(Bharat International Rice Conference)లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఏర్పాటుచేసిన స్టాల్ (Telangana Stall) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం(Agricultural University)తో కలిసి ఈ స్టాల్‌ను ఏర్పాటుచేశారు. తెలంగాణ బియ్యం ఎగుమతి సామర్థ్యాన్ని (Telangana Rice Export Capacity) ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
సమావేశానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధుల దృష్టిని తెలంగాణ స్టాల్ ఆకర్షించింది. కువైట్, ఆఫ్రికా దేశాల ప్రతినిధి.. ఎన్‌సీఈఎల్ (NCEL) ఎండీ ఉనుపోమ్ కౌసిక్, ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రేమ్ గార్గ్, దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖ బియ్యం ఎగుమతిదారులు తెలంగాణ స్టాల్‌ను సందర్శించారు. ఎంటీయూ 1010, ఆర్ఎన్ఆర్ 15048, బీపీటీ 5204, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 118 – జై శ్రీరామ్(Jai Sriram), హెచ్ఎంటీ సోనా(HMT Sona), చిట్టిముత్యాలు వంటి ప్రీమియం రకాల బియ్యాన్ని తెలంగాణ స్టాల్‌లో ప్రదర్శించారు.

ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ‘తెలంగాణలో పండించే బియ్యాన్ని ఇప్పటికే ఫిలిప్పిన్స్(Philippines)కు ఎగుమతి చేస్తున్నాం. అలాగే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాం. బియ్యం ఎగుమతి పెరిగితే.. తెలంగాణ రైతులకు చాలా మేలు జరుగుతుంది’ అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్-అఫీషియో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. స్టీఫెన్ రవీంద్ర, సెక్రెటరీ కోఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్ ,ఇతర పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
