Homeఆదాబ్ ప్రత్యేకంభారత రత్న శ్రీ అటల్ బిహారి వాజపేయీ జీ జన్మ శతాబ్ది వేడుకలు

భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజపేయీ జీ జన్మ శతాబ్ది వేడుకలు

  • ట్రీనేత్ర ఫౌండేషన్ – కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవంతం

భారత రత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజపేయీ జీ జన్మ శతాబ్ది సందర్భంగా, ట్రీనేత్ర ఫౌండేషన్ మరియు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన స్మారక కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని సర్దార్ పటేల్ హాల్, కేశవ్ మెమోరియల్ కాలేజ్, నారాయణగూడలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ ఎం. వెంకయ్య నాయుడు జీ (భూతపూర్వ ఉపరాష్ట్రపతి) తన ప్రసంగంలో అటల్ బిహారి వాజపేయీ గారితో తనకు ఉన్న వ్యక్తిగత అనుభవాలను హృద్యంగా పంచుకున్నారు. అటల్ జీ సమ్మిళిత, సుదృఢ, సమున్నత భారత స్వప్నికుడని, ఆయన జీవితం ప్రతి యువకుడికి ఒక తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. వాజపేయీ గారి పాలన సుపరిపాలనకు చిరునామా అని, అందుకే డిసెంబర్ 25ను దేశం మొత్తం ‘సుపరిపాలన దినోత్సవం (Good Governance Day)’గా జరుపుకుంటోందని తెలిపారు.

- Advertisement -
Atal Bihari Vajpayee Birth Centenary Celebrations Hyderabad 1

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాజపేయీ గారి వ్యక్తిత్వం, వక్తృత్వం, కర్తృత్వం, మితృత్వంతో కూడిన నాయకత్వం భారత రాజకీయాలకు విలువల వన్నెలు అద్దిందని కొనియాడారు. రహదారులు, టెలికాం, విద్య రంగాల్లో నేటి ఆధునిక భారత్‌కు పునాది వేసింది అటల్ బిహారి వాజపేయీ గారేనని స్పష్టం చేశారు.

Atal Bihari Vajpayee Birth Centenary Celebrations Hyderabad 5

ట్రీనేత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు నూనె బాల్‌రాజ్ తన ప్రధాన ప్రసంగంలో మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో సేవాభావంతో ట్రీనేత్ర ఫౌండేషన్ ఆవిర్భవించిందని తెలిపారు. మహిళలకు ఉచిత న్యాయ సహాయం, గృహ హింస బాధితులకు కౌన్సెలింగ్, గిరిజనులు–షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి (TSP & SSP), రైతుల శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థుల ప్రోత్సాహం, దివ్యాంగుల సంక్షేమం వంటి అనేక సేవా కార్యక్రమాలను వివరించారు.
“ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకుండా, పక్షపాతం లేకుండా, సేవనే ధర్మంగా భావించి ట్రీనేత్ర పనిచేస్తోంది – ‘Equity for All’ ఇదే మా తత్వం” అని స్పష్టం చేశారు.

Atal Bihari Vajpayee Birth Centenary Celebrations Hyderabad 4

అటల్ జీ కవితలను హిందీలో పఠిస్తూ, ఇంగ్లీష్ మరియు తెలుగులో వివరణ ఇస్తూ సాగిన నూనె బాల్‌రాజ్ గారి ప్రసంగం సభను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన వినయపూర్వకంగా శ్రీ వెంకయ్య నాయుడు జీ అనుమతి తీసుకొని ఆయనను “నా రైమింగ్ హీరో”గా సంబోధించగా, సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. దీనికి వెంకయ్య నాయుడు జీ చిరునవ్వుతో స్పందించారు.

Atal Bihari Vajpayee Birth Centenary Celebrations Hyderabad 3

జాతీయ స్థాయి పరిశోధనా కార్యక్రమంపై మాట్లాడుతూ, “Atal Drishti – Vikasit Bharat ka Sankalp” అంశంపై దేశవ్యాప్తంగా 55 పరిశోధనా పత్రాలు అందాయని, పూర్తిగా పారదర్శకమైన బ్లైండ్ రివ్యూ విధానంలో ఎంపికైన 15 పరిశోధనలను పుస్తక రూపంలో విడుదల చేయడం గర్వకారణమని తెలిపారు. ఈ పరిశోధన పుస్తకం యువతకు అటల్ జీ ఆలోచనలను లోతుగా పరిచయం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డా. కె. లక్ష్మణ్ జీ (గౌరవ రాజ్యసభ సభ్యులు) మాట్లాడుతూ, అటల్ బిహారి వాజపేయీ గారి రాజకీయ జీవితం విలువలతో కూడిన పాలనకు చిరునామా అని పేర్కొన్నారు. అభివృద్ధి–సంక్షేమం మధ్య సమతుల్యతను సాధించిన నాయకుడు అటల్ జీ అని, యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. జాతీయ పరిశోధన, అకాడమిక్ చర్చలకు వేదికగా మారిన ఈ కార్యక్రమాన్ని ఆయన విశేషంగా ప్రశంసిస్తూ, ట్రీనేత్ర ఫౌండేషన్ చేస్తున్న మేధోపరమైన ప్రయత్నాలు దేశానికి అవసరమని అన్నారు.

Atal Bihari Vajpayee Birth Centenary Celebrations Hyderabad 2

మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ జీ అటల్ జీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సామాన్య కుటుంబం నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన ఆయన ప్రయాణం అపూర్వమని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా హృదయాల్లో విభేదాలు ఉండకూడదన్న అటల్ జీ సందేశం నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకమని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా, ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులు హాజరై అవార్డులు స్వీకరించారు. మొత్తం 1000 మందికి పైగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చివరగా ట్రీనేత్ర ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు భారతీ కలవగుంట ఓటు ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తూ, అటల్ బిహారి వాజపేయీ గారి భావజాలం – విలువలతో కూడిన పాలన, సమ్మిళిత అభివృద్ధి – ఇవే ట్రీనేత్ర ఫౌండేషన్ కార్యాచరణకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అతిథులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు, పోలీసు శాఖకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News