- అద్భుతమైన లాభాలు కురిపిస్తున్న అల్యూమినియం..
- కమోడిటీ ఎక్స్చేంజ్ లో దూసుకుపోతున్న లోహం..
సాధారణంగా పెట్టుబడి అనగానే మనకు గుర్తొచ్చేవి బంగారం, వెండి లేదా రియల్ ఎస్టేట్. కానీ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ మారుతోంది. గత ఏడాది కాలంగా రాగి, బంగారం కంటే అల్యూమినియం అద్భుతమైన లాభాలను కురిపిస్తూ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఈ లోహం ధరలు కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. ఇటీవలి ట్రేడింగ్‌లో అల్యూమినియం ధరలు 0.51 శాతం పెరిగి కిలోగ్రాముకు రూ.365.30 వద్ద కొనసాగుతున్నాయి. జనవరి 29న నమోదైన రూ.370 ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి ఇది చాలా దగ్గరగా ఉంది. కేవలం నెల రోజుల్లోనే 10 శాతం మేర లాభపడటం దీని పెరుగుదల వేగాన్ని సూచిస్తోంది.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు: అల్యూమినియం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయ పరిణామాలు ప్రధాన కారణంగా ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాలలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ అల్యూమినియం సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచ సరఫరాలో 9% వాటా ఉన్న ఈ ప్రాంతంలో ఉత్పత్తి 6% తగ్గింది. అలాగే హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల లోహశుద్ధి కర్మాగారాలు పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నాయి.రాబోయే రెండో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 లక్షల టన్నుల అల్యూమినియం కొరత ఏర్పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తగ్గడం ధరలకు రెక్కలు తెస్తోంది.
