Homeఆదాబ్ ప్రత్యేకంAadab Hyderabad | అవినీతిపై అక్షర సమరం

Aadab Hyderabad | అవినీతిపై అక్షర సమరం

15వ వసంతంలోకి ‘ఆదాబ్ హైదరాబాద్’

  • రవీంద్రభారతి వేదికగా వైభవంగా 15వ వార్షికోత్సవ వేడుకలు..
  • కార్యక్రమానికి హాజరైన మంత్రులు, పోలీసు అధికారులు, ఇతర ప్రముఖులు..
  • ఆదాబ్ ప్రస్థానాన్ని ప్రశంసించిన ఆహుతులు..
  • ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
  • వివిధ రంగాలవారికి సత్కారం గావించిన ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ..
  • పెద్దగా తరలివచ్చిన ఆదాబ్ అభిమానులు,. శ్రేయోభిలాషులు..

అనుకున్న సమయం ఆసన్నమైంది.. అద్భుత వేడుక అయ్యింది.. గత రెండునెలలుగా ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక యాజమాన్యం, సిబ్బంది పడిన శ్రమకు ఫలితం దక్కింది.. నగరంలోని రవీంద్రభారతి పులకించిపోయింది.. ఆహుతులైన రాజకీయ ప్రముఖులు, సామాజికవేత్తలు, కళాకారులు, పాత్రికేయులు, విద్యా, వ్యాపారవేత్తలు, అభిమానులు, ప్రకటన కర్తలు, ఏజెంట్లు ఒక్కరేమిటి వందలాదిగా తరలివచ్చారు.. ఆదాబ్ 15వ వార్షిక వేడుకలను తిలకిస్తూ ఆనందించారు.. ప్రముఖుల అభినందనలతో.. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ఆసాంతం ఆనందోత్సాహాలతో సాగిపోయింది..

- Advertisement -

ఉదయం 10గంటలకు మొదలైన వేడుకలు సాయంత్రం ఆరుగంటల వరకు ఉత్సాహభరితంగా సాగిపోయాయి.. విచ్చేసిన రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వ్యాపార వేత్తలు, విద్యావేత్తలు, పోలీసు అధికారులు తదితర ప్రముఖులు ఆదాబ్ ప్రస్థానాన్ని, మొక్కవోని ధైర్యాన్ని వేనోళ్ళా కొనియాడారు.. పత్రికా రంగంలో తనదైన శైలిలో సాగిపోతున్న ఆదాబ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు..

గొప్ప విషయం ఏమిటంటే ఆదాబ్ వేడుకలకు ఇతర మీడియా సంస్థల ప్రముఖులు కూడా హాజరై తమ శుభాకాంక్షలు అందజేయడం.. ఆదాబ్ తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలకుండా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అప్రతిహతంగా సాగిపోతుండటం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా తెలియజేయడం కొసమెరుపు.. ఎన్ని ఆటంకాలు వచ్చినా తాను అనుకున్న మార్గంలోనే ముందుకు సాగుతానని తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు..

హైదరాబాద్ నడిబొడ్డున వెలసిన రవీంద్రభారతి వేదికగా ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఆసాంతం ఆహ్లాదకరంగా సాగింది.. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర రావు, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, గౌడ సంఘం ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఇంకా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెలేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ స్థపతి పద్మశ్రీ ఆనంద వేలు చారి, అదేవిధంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్, బీజేపీ ప్రముఖులు నూనె బాల్ రాజ్, టి.ఆర్.ఎస్. అధినేత్రి కల్వకుంట్ల కవిత, వకుళాభరణం కృష్ణమోహన్ రావు, రాజేశం గౌడ్ ఇంకా ఎంతోమంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, కళాకారులు, మీడియా ప్రతినిథులు హాజరైయ్యారు.. బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్ర రావు, పద్మశ్రీ ఆనంద వేలుచారి, కె.కేశవరావు ఇతర ప్రముఖుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది..

మంత్రి పొన్నం ప్రభాకర్ : చిన్న పత్రిక అని అందరూ అంటుంటారు.. కానీ ఆదాబ్ హైదరాబాద్ తన ప్రయాణంలో పెద్ద పత్రికలను సైతం ఆలోచించే విధంగా సాగిపోతోంది, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అప్రతిహతంగా ముందుకుసాగుతోందని.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేశాలా తనవంతు కృషి చేస్తోందని కొనియాడుతూ మున్ముందు మరింత ప్రజ్వలంగా వార్తా ప్రపంచంలో వెలిగిపోవాలని ఆకాంక్షించారు..

బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్ర రావు : ఆదాబ్ హైదరాబాద్ 14 సంవత్సరాలు విజయవంతంగా నడుస్తోంది అంటే మామూలు విషయం కాదని.. నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా వార్తలు అందించడంలో విజయవంతం అయ్యిందని..ఎందరికో మార్గగామిగా సాగిపోతోంది అన్నారు..

బీజేపీ ఎంపీ లక్ష్మణ్ : ఆదాబ్ విజయవంతమైన 14 ఏళ్ల ప్రయాణాన్ని అభినందిస్తూ.. సత్యం వీరమళ్ళ కృషికి, ఈరోజు ఫలితాన్ని అందరూ చూస్తున్నారని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు అభినందనలు అందజేశారు..
కే.కేశవరావు : ప్రతీక నడపడంలో వున్న కష్టాలు ఏమిటో తనకు బాగా తెలుసనీ.. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పత్రికను 14 సంవ త్సరాల పాటు నడపడం అంత ఆషామాషీ విషయం కాదని.. అలాంటిది ఆదాబ్ 15ఏళ్ల వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవ డం ఎంతో సంతోషకరమని,అభినందనీయమని కొనియాడారు..

వకుళాభరణం కృష్ణమోహన్ రావు : ఆదాబ్ పత్రిక చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉంటుందని తెలిపారు.. పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా ఈరోజు ఆదాబ్ ప్రచురించే వార్తలు, కథనాలు చదువుతూ.. ఫాలో అవుతున్నారంటే అది మామూలు విషయం కాదని, దీని వెనుక ఎంతో కృషి, శ్రమ దాగివుందని తెలిపారు.. ఆదాబ్ ప్రస్థానం 15 సంవత్సరాలే కాకుండా వంద సంవత్సరాలు పైగా కొనసాగాలని ఆకాంక్షించారు..

నూనె బాల రాజ్ : ఢిల్లీలో బీజేపీ తెలంగాణ ప్రతినిధి నూనె బాల్ రాజ్ మాట్లాడుతూ ఆదాబ్ కు తనకు ఉన్న ఆత్మీయ పరిచయాన్ని పంచుకున్నారు.. వెన్ను చూపక మొక్కవోని ధైర్యంతో.. ఒక విశిష్టమైన పంథాతో సాగిపోతున్న ఆదాబ్ కి అభినందనలు తెలియజేశారు.. ఇతర నాయకులు మాట్లాడుతూ.. సత్యం వీరమళ్ళ ఎప్పుడూ తెరవెనుకమాత్రమే ఉంటారని.. ఈరోజు ఆయనను చూసే అవకాశం కలిగిందని.. ప్రతిభ వున్నవారు ఎప్పుడూ తమ ప్రతిభను మాత్రమే తెలియజేస్తారని.. ఆకోవలోకే ఆయన వస్తారని.. ఆదాబ్ మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు..

కల్వకుంట్ల కవిత : చిన్న పత్రికలంటే అందరికీ చిన్నచూపు ఉందని, ఇవాళ ఎన్నో వందల పత్రికలు నడుస్తున్నాయని, కానీ ఆదాబ్ హైదరాబాద్ పత్రిక అన్ని పత్రికలకంటే భిన్నంగా ముందుకు సాగుతోందని.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పత్రికలను, పాత్రికేయులను ఎప్పుడూ చిన్నచూపు చూస్తూనే ఉంటారని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్రికా రంగాన్ని ఉజ్వలంగా తీర్చి దిద్దుతామని.. పాత్రికేయులకు అన్ని సౌకర్యాలు కలుగజేస్తామని.. వారికి నివాస స్థలాలు, విద్య, వైద్యంపై దృష్టిపెడతామని మాట ఇచ్చారు..

బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్ : రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆదాబ్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు.. మరింత ఉన్నతస్థానానికి ఎదగాలని ఆశించారు..

నగర సీపీ సజ్జనార్ : సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ఎంతో నిష్పక్షపాతంగా అక్షర యజ్ఞం చేస్తున్న ఆదాబ్ ని ప్రత్యేకంగా అభినందించారు.. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తమ సహకారం ఎల్లవేళలా అందిస్తామని హామీ ఇచ్చారు..

ఇక వార్షికోత్సవ వేడుకల్లో నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయం, సంస్కృతి, సామాజిక సందేశాలను ప్రతిబింబించేలా చిన్నారులు చేసిన నృత్యాలు సభికులను విశేషంగా అలరించాయి. చిన్నారుల ప్రతిభకు ప్రేక్షకుల నుంచి కరతాళధ్వనులు లభించాయి. అదేవిధంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన నాటకాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ప్రదర్శించిన నాటకాలు వినోదంతో పాటు చక్కటి సందేశాన్ని అందించాయి. కళాకారుల నటన, సంభాషణలు, ప్రదర్శనా శైలి విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులకు, విచ్చేసిన ప్రముఖులకు, పాత్రికేయులకు ఆదాబ్ యాజమాన్యం సన్మానకార్యక్రమం నిర్వహించి వారిని గౌరవించుకున్నారు..

ఈ క్రమంలో పత్రికా రంగంలో 15 ఏళ్లుగా ఆదాబ్ హైదరాబాద్ కొనసాగిస్తున్న ప్రస్థానాన్ని పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సామాన్యుల గొంతుకగా నిలవడం, సమాజంలోని వివిధ వర్గాల సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడంలో పత్రిక చేస్తున్న కృషిని ప్రశంసించారు. వార్తలకు మాత్రమే పరిమితం కాకుండా కళలు, సంస్కృతి, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన ఈ వేడుక ఆదాబ్ హైదరాబాద్ 15 ఏళ్ల ప్రస్థానానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ప్రజల విశ్వాసం, ఆదరణే తమకు బలమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ మరింత నిబద్ధతతో ప్రజా సమస్యలపై పోరాడుతూ, సమాజ హితం కోసం తమ కలాన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

అవినీతిపై అస్త్రంగా మా అక్షరం: సీఎండీ సత్యం వీరమళ్ల : ఈ విజయోత్సవ సభలో పత్రిక సీఎండీ సత్యం వీరమళ్ల మాట్లాడుతూ… “మా అక్షరం – అవినీతిపై అస్త్రం” అనే బలమైన నినాదంతో ప్రారంభమైన తమ సుదీర్ఘ ప్రయాణం నేడు 15వ ఏటలోకి అడుగుపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. ఏ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా ప్రజా సమస్యలను వెలికితీస్తూ, ప్రజల తరఫున ఒక అక్షర యజ్ఞంలా పత్రికను నడుపుతున్నామని స్పష్టం చేశారు. తమపై నమ్మకం ఉంచిన పాఠకులకు, మద్దతుగా నిలిచిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రముఖుల ప్రశంసల జల్లు :

రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు : ఆదాబ్ హైదరాబాద్ పత్రిక సాగిస్తున్న నిష్పాక్షికమైన సేవలను కొనియాడారు. సమాజంలోని అక్రమాలను నిలదీస్తూ, క్షేత్రస్థాయి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో పత్రిక వహిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అభినందించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే దిశగా పత్రిక ప్రత్యేక కథనాలు నిలుస్తున్నాయని ప్రశంసించారు పోలీస్ అధికారులు.. యాజమాన్యానికి, జర్నలిస్టుల బృందానికి శుభాకాంక్షలు అందజేశారు. జర్నలిజం విలువలను కాపాడుతూ సాగుతున్న ‘ఆదాబ్ హైదరాబాద’ మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని వేడుకల్లో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, అభిమానులు ఆకాంక్షించారు. ఆదాబ్ సీఎండీ సత్యం వీరమళ్ళ వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News