Homeనిజామాబాద్‌Goud Community | గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి!

Goud Community | గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి!

  • దాడులు నిలిపివేయకపోతే కల్లు దుకాణాలను మూసివేసి నిరసన చేపడతాం..
  • జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్ హెచ్చరిక

తాడ్వాయి: కామారెడ్డి గౌడ కులస్తులను(Goud Community) లక్ష్యంగా చేసుకుని కల్లు దుకాణాలపై నార్కోటిక్ అధికారులు నిర్వహిస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళీ గౌడ్ డిమాండ్ చేశారు. దాడుల పేరుతో గౌడ కులస్తులను భయభ్రాంతులకు గురిచేస్తూ, వారి జీవనోపాధిని దెబ్బతీయడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా సంప్రదాయ కల్లు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గౌడ కుటుంబాలను అధికారులు అనవసరంగా ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. కల్లు దుకాణాల వద్ద తనిఖీల పేరుతో వేధింపులకు పాల్పడటం వల్ల వృత్తిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కడైనా జరిగినట్లయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అయితే సంప్రదాయ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న గౌడ కులస్తులను(Goud Community) లక్ష్యంగా చేసుకుని వేధించడం సరికాదని స్పష్టం చేశారు. అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలే తప్ప, ఒక సామాజిక వర్గం జీవనోపాధికి విఘాతం కలిగించేలా వ్యవహరించకూడదని హితవు పలికారు.

నార్కోటిక్ అధికారుల దాడులు, వేధింపులు తక్షణమే నిలిపివేయాలి. లేనిపక్షంలో గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉద్యమించి, కల్లు దుకాణాలను మూసివేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని రంగోళ్ల మురళీ గౌడ్ హెచ్చరించారు. ఈ సమస్యపై ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గౌడ కులస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

గౌడ కులస్తుల ఆత్మగౌరవం, సంప్రదాయ వృత్తి, జీవనోపాధి పరిరక్షణే లక్ష్యంగా జై గౌడ ఉద్యమం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, మొగుళ్ల రామా గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, అధికం నర్సా గౌడ్, కామారెడ్డి నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News