- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
- ఫామ్ పాండ్స్ ద్వారా నీటిని నిల్వ చేసుకొని పంటలను కాపాడుకోవాలి.
జగిత్యాల: రానున్న ఆరు నెలల్లో ఎల్‌నినో ప్రభావం కారణంగా తాగునీరు, సాగునీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున నీటి సంరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(Jagtial Collector Satya Prasad) అన్నారు.
మంగళవారం కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో ఓ రైతు తన మామిడి తోటలో ఏర్పాటు చేసుకుంటున్న ఫామ్ పాండ్‌ను, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రానున్న వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు.
కోరుట్ల మండల పరిధిలో సుమారు రెండు లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు నీటి లభ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో మొత్తం 75 ఫామ్ పాండ్స్ మంజూరు చేయగా, ఇప్పటివరకు 12 పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఫామ్ పాండ్స్ పనులను రానున్న నెల రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మధ్యమధ్యలో చిరుజల్లుల రూపంలో వర్షాలు కురిసినా, ఆ నీటిని ఫామ్ పాండ్స్‌లో నిల్వ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో పంటలకు కొంతమేర నీటిని అందించే అవకాశం ఉంటుందని వివరించారు.

ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో సుమారు రెండు గుంటల విస్తీర్ణంలో ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకుంటే నీటి ఎద్దడి సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ సూచించారు. భూగర్భ జలాలు తగ్గినప్పుడు, వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ నీటి నిల్వలు రైతులకు అండగా నిలుస్తాయని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి సాగునీరు వచ్చే అవకాశం లేనందున రైతులు నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వరి, చెరకు వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని అన్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా నీటి కొరత ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం పరిశీలన
అనంతరం ధర్మారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థుల మరుగుదొడ్లు, బోరు, అంగన్వాడీ కేంద్రం, వంటశాలను పరిశీలించి, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని నిర్ణీత మెనూ ప్రకారం అందించాలని, భోజనం తయారీలో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, డీఆర్డీఓ రఘువరన్, ఎంపీడీవో, తహసీల్దార్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
