- భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదు
- రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక
సంగారెడ్డి: రెవెన్యూ శాఖలో పనితీరు మారాలి.. రైతుల భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభించాలి.. భూ సర్వేలో పారదర్శకత పాటించాలి.. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటే సహించేది లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) అధికారులను హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు ఆదేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా బాధ్యతాయుతంగా పనిచేయకపోతే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, హౌసింగ్ శాఖల పనితీరుపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సర్వే పురోగతి, పెండింగ్ దరఖాస్తులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతులకు భూమి విస్తీర్ణంపై స్పష్టత ఇవ్వాలి
రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం రీ సర్వే చేపట్టిందని మంత్రి తెలిపారు. సర్వే కోసం కేటాయించిన గ్రామాలు, పూర్తయిన సర్వేలు, రోజువారీ పురోగతి, పనులు పూర్తిచేయడానికి పట్టే సమయంపై తహసీల్దార్లు, సర్వేయర్లను ప్రశ్నించారు. సర్వే సమయంలో ప్రతి రైతుకు తన భూమి విస్తీర్ణం, సరిహద్దులపై స్పష్టమైన సమాచారం అందించాలని ఆదేశించారు. రైతులకు సందేహాలు మిగలకుండా క్షేత్రస్థాయిలోనే వివరించాలని సూచించారు.

తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు అధికారులు సర్వే పనులను నిరంతరం పర్యవేక్షించాలని, గ్రామాల్లో పర్యటించి పురోగతిని స్వయంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటూ భూ సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవసాయ భూములతోపాటు ఆబాదీ ఆస్తుల రీ సర్వేను ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందని తెలిపారు.
పేదలకు సొంతింటి కల సాకారం
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారమయ్యే వరకు విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారులపై నిర్మాణ వ్యయ భారం తగ్గించేందుకు సిమెంట్ బస్తాను రూ.230కే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులు పూర్తి పారదర్శకతతో, అర్హత ప్రాతిపదికన జరగాలని సూచించారు. సమీక్షకు ముందు పలువురు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత జిల్లా కలెక్టర్లకు మంత్రి పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేశ్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంజీవరెడ్డితోపాటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్ జైన్, హైమావతి, ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
