- కచ్చితత్వం, పారదర్శకతతో జనాభా గణన చేపట్టాలి
- సర్కిళ్లు 31 నుంచి 60 వరకు ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులకు అవగాహన
హైదరాబాద్: భారత జనాభా గణన–2027ను సమర్థవంతంగా, కచ్చితత్వంతో నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ అధికారులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31 నుంచి 60 సర్కిళ్లకు చెందిన ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులకు జనాభా గణన రెండో దశ అయిన జనాభా లెక్కింపు (పాపులేషన్ ఎన్యుమరేషన్–PE) ప్రక్రియపై మంగళవారం శిక్షణ అందించారు.
తెలంగాణ రాష్ట్ర జనాభా గణన కార్యకలాపాల డైరెక్టర్ భారతి హోల్లికేరి, ఐఏఎస్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ బి. సంతోష్ కుమార్, ఐఏఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. జనగణన(Census 2027 Training) అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ కార్యక్రమమని, ఇందులో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు సూచించారు.
జనగణన ప్రక్రియపై సమగ్ర అవగాహన
జనగణన–2027(Census 2027 Training) ప్రాముఖ్యత, గణన నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలు, ఎన్యుమరేషన్ బ్లాకుల ఏర్పాటు, సంక్షిప్త గృహ జాబితాల తయారీపై అధికారులకు వివరించారు. సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎంఎస్) పోర్టల్లోని వివిధ మాడ్యూళ్లు, వాటి వినియోగంపై సమగ్ర శిక్షణ ఇచ్చారు.

క్షేత్రస్థాయిలో గణన సిబ్బంది, పర్యవేక్షకులు వినియోగించే జనగణన మొబైల్ అప్లికేషన్ పనితీరును వివరించారు. జనాభా గణనలో భాగంగా 1 నుంచి 40 వరకు ఉన్న ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ప్రజల నుంచి ఎలా సేకరించాలి, వాటిని డిజిటల్ విధానంలో ఎలా నమోదు చేయాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకునే స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియపైనా శిక్షణ ఇచ్చారు.
క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
గణన సిబ్బంది, పర్యవేక్షకులకు శిక్షణ అందించే విధానం, ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, జనగణన నిర్వహణలో ఎదురయ్యే అంశాలను సమర్థవంతంగా పరిష్కరించే కార్యాచరణపై చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ గణన ప్రక్రియను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర జనాభా గణన కార్యాలయ జాయింట్ డైరెక్టర్, నేషనల్ ట్రైనర్ వి. శ్రీకాంత్, స్టాటిస్టికల్ ఆఫీసర్ శివరాజు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు.
తప్పులు, పునరావృతాలకు తావులేకుండా గణన
జనగణనలో సేకరించే సమాచారం నాణ్యతతో కూడినదిగా ఉండాలని, ప్రతి దశలో కచ్చితత్వం పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులోగా సన్నాహక చర్యలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబం, నివాస గృహం, జనగణన గృహం, భవనం గణన పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి వివరాలు మిస్సవకుండా, ఒకే వివరాలు రెండుసార్లు నమోదు కాకుండా సమగ్రంగా జనాభా గణన చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దేశ భవిష్యత్తు ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలకు జనగణన గణాంకాలు కీలక ఆధారమని, ఈ నేపథ్యంలో అధికారులు అత్యంత నిబద్ధతతో తమ విధులు నిర్వర్తించాలని వారు పిలుపునిచ్చారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
