‘సాహితీ సిస్టమ్స’ కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ?
- హితోధికంగా సహకారం అందించిన ఈజీఎంఎం – తెలంగాణ
- ఫేజ్-1లో రూ. 10 కోట్లు, ఫేజ్-2లో రూ. 36 కోట్లు ఏకపక్షంగా కట్టబెట్టిన వైనం.
- బీహార్, మహారాష్ట్ర, ఏపీల్లో విఫలమై, ఒడిశాలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన సంస్థ..
- తెలంగాణాలో ఎవరి స్వార్థం కోసం పెద్దపీట వేశారు..?
- ఆరేళ్లలో కేవలం 500 మందికి శిక్షణ ఇచ్చిన సంస్థ..
- ముగింపు దశలో 9 నెలల్లోనే 3,766 మందికి ట్రైనింగ్ ఎలా ఇచ్చింది?
- పీసీఓ గడువు ముగిసినా ఎలా పొడిగించారు?
- నిబంధనల తుంగలో తొక్కి అర్హత లేకున్నా అందలం..
- దర్జాగా ‘3వ ఇన్స్టాల్మెంట’ నిధులు విడుదల.
- సాహితీ సిస్టమ్స్ సంబంధించిన పూర్తి లావాదేవీలపై విజిలెన్స్ విచారణ జరపాలి..
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన పేరుతో సాగిన వ్యవహారం నిధులను అడ్డంగా దోచుకోవడానికి మార్గంగా మారిందా? వాటి వాస్తవ పరిస్థితులపై ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ‘సాహితీ సిస్టమ్స్’ కేంద్రంగా జరిగిన కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు లేదా అత్యున్నత స్థాయి విజిలెన్స్ విచారణ చేపట్టాలనే డిమాండ్లు జోరందుకున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం(DDU-GKY Scheme) నిధులు పక్కదారి పట్టినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ – తెలంగాణలోని కొందరు అధికారుల అండదండలతో “సాహితీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్” అనే సంస్థ అర్హత లేని సమయంలో కూడా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రాజెక్టుల పేరిట భారీగా ప్రజాధనం స్వాహా :
సాహితికి కేటాయించిన నిధులు :
ప్రాజెక్ట్ – 1 (2014 – 2018) : రూ. 10 కోట్లు.. ప్రాజెక్ట్ – 2 (2019 – 2025): రూ. 36 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.. కాగా బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రాజెక్టులను పూర్తి చేయలేక చేతులెత్తేసిన చరిత్ర ఈ సంస్థకు ఉందని, చివరకు ఒడిశా రాష్ట్రంలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని కూడా తెలుస్తోంది.. అయినప్పటికీ తెలంగాణలో మాత్రం పెద్ద ఎత్తున నిధులు, ప్రాజెక్టులు కట్టబెట్టడం వెనుక అసలు సూత్రధారులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
9 నెలల్లోనే వేల మందికి శిక్షణ ఎలా సాధ్యం?
2019 నుండి మార్చి 2025 వరకు (సుమారు ఆరేళ్ల కాలంలో) కేవలం 500 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చిన ఈ సంస్థ, మార్చి 2025 నుండి డిసెంబర్ 2025 మధ్య కేవలం 9 నెలల వ్యవధిలోనే 3,766 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు రికార్డుల్లో చూపించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. మొత్తం 4,266 మంది వివరాలను క్షేత్రస్థాయిలో నిగ్గు తేల్చాల్సి ఉంది. అయితే ప్రాజెక్ట్ కమెన్స్మెంట్ ఆర్డర్ గడువు మార్చి 2025తో ముగిసినప్పటికీ, ఆ గడువు తేదీని సవరించి మరీ ఈ ఒక్క సంస్థకే భారీ టార్గెట్ ఎందుకు కేటాయించారు? అన్నది ఇప్పుడు తేలాల్సిన విషయం..?

అనుమానాలు రేకెత్తిస్తున్న ఉపాధి కల్పన లెక్కలు :
ఇన్ని సంవత్సరాలలో కేవలం 2,222 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించినట్లు చెబుతున్నప్పటికీ, ఆ ఉద్యోగాల గణాంకాల్లో ఎంతవరకు వాస్తవం ఉందో దర్యాప్తు చేయాల్సి ఉంది. మిగిలిన వేలాది మంది పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
అర్హత లేకపోయినా ‘థర్డ్ ఇన్స్టాల్మెంట్’ చెల్లింపులు :
సాహితీ సిస్టమ్స్ సంస్థకు ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం అర్హత లేని సమయంలో సైతం 3వ విడత నిధులను ఏ విధంగా విడుదల చేశారు? దీని వెనుక ఉన్న ఈజీఎంఎం ఉన్నతాధికారులు ఎవరు? సంబంధిత ప్రొసీడింగ్స్ ఎవరి ప్రోద్భలంతో తయారయ్యాయి? సాహితీ సిస్టమ్స్‌తో అధికారులకున్న ఆర్థిక సంబంధాలు ఏమిటి అన్నది తెలియాల్సి వుంది..
స్వతంత్ర – విజిలెన్స్ విచారణకు వెల్లువెత్తుతున్న డిమాండ్స్ :
తెలంగాణ వ్యాప్తంగా ఈ సంస్థకు సంబంధించిన శిక్షణా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి లీజు/రెంటల్ ఒప్పందాలు, సర్వీస్ ప్రొవైడర్ల అగ్రిమెంట్లు, బ్యాంకు లావాదేవీలను, అదేవిధంగా సాహితీ సిస్టమ్స్ కి సంబంధించిన పూర్తి శిక్షణ వివరాలను, అలాగే ఆర్థిక లావాదేవీలను సమగ్రంగా పరిశీలించాలి. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన సాహితీ సిస్టమ్స్ యాజమాన్యంపై, వారికి సహకరించిన అధికారులపై తక్షణమే విజిలెన్స్, స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా పూర్తిస్థాయి విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
