- ఇష్టా రీతిన టెస్టింగ్ రిపోర్టులు, ఎందుకు పనికిరాని లీగల్ మెట్రాలజి శాఖ..
- అన్ని వర్గాల కుటుంబాలకు పొదుపు మాంధ్యమంగా బంగారం..
- కుటుంబ గౌరవంగా ఉంటున్న బంగారం కల్తీ అవుతోంది..
బంగారు బతుకులకు బజారు మోసాలు.. లీగల్ మెట్రాలజీ నిర్లక్ష్యంతో నింగికెక్కుతున్న నకిలీ దందాలు!(Gold Jewellery Irregularities) పేదోడి చెమటోడ్చిన కష్టార్జితం.. రెక్కల కష్టంతో కూడబెట్టిన డబ్బుతో కొనుక్కునే పసిడి.. నేడు కల్తీ పాలువుతోంది. కుటుంబానికి శ్రీరామరక్షగా, పవిత్రతకు ప్రతీకగా భావించే కనీసం ‘పుస్తెలతాడు’ సైతం స్వచ్ఛతను కోల్పోతూ మోసపోతున్న దయ నీయ పరిస్థితి మన కళ్లముందే కదిలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ వందలాది కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నా.. వినియోగదారుడికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిద్రమత్తులో జోగుతోంది.
ఈ దందాలపై నిఘా పెట్టాల్సిన లీగల్ మెట్రాలజీ శాఖ వద్ద.. కనీసం బంగారం నాణ్యతను పరీక్షించే ప్రాథమిక పరికరాలు కూడా లేవని నిస్సిగ్గుగా చేతులెత్తేయడం ఏ వ్యవస్థ వైఫల్యానికి సంకేతం? ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన అధికారులే నేరస్తులకు అండగా మారుతున్నారా? కోట్ల రూపాయల వ్యాపారం జరిగే చోట తూనికలు, కొలతలు, స్వచ్ఛతను పరిశీలించే వ్యవస్థ లేకపోవడం దుర్మార్గం మాత్రమే కాదు, ప్రజల నమ్మకానికి చేస్తున్న ద్రోహం.
ఒక కుటుంబానికి గౌరవంగా ఉంటున్న బంగారం కల్తీ అవుతోంది.. దీనిపై సరియైన పరిష్కారం చూపని అధికార వ్యవస్థ. బంగారు, వెండి ఆభరణాల నాణ్యత ధ్రువీకరణ గురించి సరైన రిపోర్టులు ఇవ్వడంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, లీగల్ మెట్రాలజీ శాఖలు విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో అక్రమ వ్యాపారస్తులు విచ్చలవిడిగా వినియోగదారులను, ముఖ్యంగా మహిళలను కల్తీ ఆభరణాల అమ్మకాల ద్వారా దోపిడి చేస్తూనే ఉన్నారు.
బంగారు ఆభరణాలు నాణ్యత దృవీకరణ కొరకు బ్యూరో ఆఫ్ ఇండియా సాండర్స్ అమల్లోకి తెచ్చిన హాల్ మార్కింగ్ విధానం “సంపూర్తిగా” లేని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బంగారు ఆభరణాల మాఫియా విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నది హాల్ మార్కింగ్ విధానం ప్రకారం మార్కెట్లో అమ్మకం జరిగే ప్రతీ ఆభరణంపై హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ హెచ్. యు.ఐ.డి. నెంబర్ ముద్రింపబడాలి. కానీ ఇటీవలనే వరంగల్లో 10 కోట్ల విలువ ఆభరణాలకు హెచ్.యు.ఐ.డి. నెంబర్ లేని కారణంగా అధికారులను సీజ్ చేశారు. అలాగే హైదరాబాదులో ఇటీవలనే నాలుగు కోట్ల విలువ గల ఆభరణాలు పట్టుబడ్డాయి.
నిజామాబాదులో(Nizamabad) హెచ్.యు.ఐ.డి. నెంబర్ లేని ఆభరణాలను అమ్మకం చేస్తున్న ఒక కార్పోరేట్ స్థాయి పెద్ద కంపెనీ అమ్మకాలపై మోసపోయిన వినియోగదారులు అంత శ్రీధర్ రెడ్డి, యాటకర్ల దేవేష్ లు వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదులను దాఖలు చేసారు. ఇకపోతే నిజామాబాదులో(Nizamabad) సుమారు (28) కంప్యూటర్ టెస్టింగ్ సెంటర్లు బంగారు వెండి ఆభరణాల నాణ్యత రిపోర్టులను జారీ చేస్తున్నాయి. ఎక్స్.ఆర్.ఎఫ్. మెషిన్లను ఏర్పాటు చేసుకున్న టెస్ట్ సెంటర్లు బంగారం, వెండి టెస్టింగ్, టంచ్, బట్టీల సెంటర్లు బంగారాన్ని కరగడం, రిఫైనరీ నిర్వహించడం, నాణ్యతను ధ్రువీకరించి జారీ చేసే సర్టిఫికెట్లకు ఎటువంటి అధికారుల ఆమోదముద్ర ఉండదు.
తమకు ఇష్టం వచ్చిన రీతిలో అనధికారికంగా బంగారు అమ్మకాలు, బంగారు నాణ్యతలను నిర్వహించడంపై, బ్యూరో ఆఫ్ ఇండియన్ సాండర్స్ అధికారులు గాని గాని లీగల్ మెట్రాలజి శాఖ అని జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యకరం. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన హాల్ మార్కింగ్ విధానానికి సమాంతరంగా మరొక అనధికార మాఫియా నాణ్యత పరీక్షలను నిర్వహించడం, బంగారు వ్యాపారాన్ని చేపట్టడం, రిఫైనరీ ను నిర్వహించడం పై వినియోగదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 రూల్ నెం. 4 ప్రకారం బంగారు వెండి ఆభరణాల నాణ్యతపై అధికారులు తనిఖీలు నిర్వహించవచ్చు. అలాగే రూల్ నెం. 5 ప్రకారం నాణ్యత పరీక్షలు కూడా చేపట్టవచ్చు. కానీ అధికారులు ఆ విధంగా నాణ్యత పరీక్షలు నిర్వహించడం లేదు. ఎందుకంటే వారి దగ్గర నాణ్యత పరీక్షలు నిర్వహించడానికి పరికరాలు లేవని వారు తెలియజేస్తున్నారు.
ఇటీవలనే నిజామాబాద్ చెందిన యాటకర్ల దేవేష్ (వినియోగదారుల ప్రతినిధి) కి స్థానిక లీగల్ మెట్రాలజీ అధికారి ఇచ్చిన సమాచారం హక్కు చట్టం పరిధిలో ఇచ్చిన సమాచారం ప్రకారం, నిజామాబాద్ ప్రాంతంలోని ఒక పెద్ద కార్పొరేట్ స్థాయి బంగారు వ్యాపార సంస్థలో అధికారి తనిఖీలు నిర్వహించాడు. కానీ నాణ్యత పరీక్షలు చేయలేదు. ఎందుకంటే తమ వద్ద పరికరాలు లేవని ఆయన తెలియజేశాడు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో లీగల్ మెట్రాలజి శాఖ కొనసాగుతున్నది.
ఇకపోతే లీగల్ మెట్రాలజీ చట్టం 2009 సెక్షన్ 22 ప్రకారం ఎక్స్.ఆర్. ఎఫ్. మిషన్ల మోడల్ అప్రూవల్ సర్టిఫికెట్ ను అధికారులు టెస్టింగ్ సెంటర్ నుండి సేకరించాలి. ఒకవేళ టెస్టింగ్ సెంటర్లు మోడల్ అప్రూవల్ సర్టిఫికెట్ చూపకపోతే, వెంటనే ఆ యొక్క మిషన్ ను అధికారులు సీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా కూడా లీగల్ మెట్రాలజి అధికారులు చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏ విధంగానూ అక్కరకు రాని లీగల్ మెట్రాలజి శాఖను మూసి వేసుకుంటే మంచిదనే అభిప్రాయం వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు.(Youtube)
