- హామీలకే పరిమితమైన తాడ్వాయి మినీ స్టేడియం నిర్మాణం ..!
– తరాలు మారినా.. తలరాత మారని వైనం …!
– మూడు దశాబ్దాలుగా ఎదురుచూపుల్లోనే యువ క్రీడాకారులు …!
- మిని స్టేడియనికి కేటాయించిన 5 ఎకరాల స్థలం నిరూపయోగంగా మారిన వైనం …!
క్రీడలకు, క్రీడాకారులకు పుట్టినిల్లుగా పేరొందిన తాడ్వాయి మండలంలో (Tadwai Mini-Stadium) మినీ స్టేడియం నిర్మాణం దశాబ్దాలుగా కలగానే మిగిలిపోతోంది. పాలకులు మారుతున్నా, ప్రభుత్వాలు గద్దెనెక్కుతున్నా మండల క్రీడారంగ తలరాత మాత్రం మారడం లేదని స్థానిక యువత, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సత్తా ఉన్నా దక్కని ప్రోత్సాహం:
తాడ్వాయి మండలంలో క్రీడా ప్రతిభకు కొదవలేదు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్,వంటి ఆటల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ఘనత ఇక్కడి క్రీడాకారులకు ఉంది. సరైన మైదానం, రన్నింగ్ ట్రాక్ లేకపోవడంతో యువత రోడ్ల పక్కన, వ్యవసాయ బాటల్లోనే ప్రాక్టీస్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్మీ, పోలీస్, ఉద్యోగాలకు సిద్ధమయ్యే గ్రామీణ యువతకు సరైన గ్రౌండ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
30 ఏళ్ల నాటి స్థల కేటాయింపు.. నేటికీ కదలని అడుగు
30 ఏండ్ల క్రితం అప్పటి తాడ్వాయి సర్పంచ్ కాశెట్టి స్వామి ప్రత్యేక చొరవతో మినీ స్టేడియం నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. భూమి సిద్ధంగా ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా నిధుల కేటాయింపు, నిర్మాణ పనులపై పాలకులు దృష్టి సారించలేదు. దీంతో ఆ స్థలం ప్రస్తుతం పిచ్చిమొక్కలు, కంపచెట్లతో అధ్వానంగా మారి నిరుపయోగంగా ఉంది.
ఎన్నికల హామీలకే పరిమితం :
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా తాడ్వాయిలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామంటూ నాయకులు వాగ్దానాలు చేయడం, గెలిచిన తర్వాత వాటిని విస్మరించడం పరిపాటిగా మారింది. పార్టీలు ఏవైనా, నేతలు ఎవరైనా తాడ్వాయి యువత ఆశలు మాత్రం ‘అందని ద్రాక్ష’గానే మిగిలాయి.
ఎమ్మెల్యే మదన్‌మోహన్‌పైనే ఆశలు :
గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడ్వాయిలో మినీ స్టేడియం మంజూరు చేయిస్తానని ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే, ఈ ప్రాంత యువత చిరకాల ఆకాంక్షను గుర్తించి తక్షణమే నిధులు మంజూరు చేయించి స్టేడియం నిర్మాణాన్ని ప్రారంభించాలని క్రీడాకారులు, మండల ప్రజలు కోరుతున్నారు
