HomeసినిమాDr Damodhar Nerella | డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల డ్రీమ్ ప్రాజెక్టు..

Dr Damodhar Nerella | డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల డ్రీమ్ ప్రాజెక్టు..

ఘనంగా డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం ప్రారంభం

  • దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు..
  • దర్శకుడిగా శశాంక్ దువ్వూరు పరిచయం..
  • రొమాన్స్ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు ఆసక్తికర కథాంశం

డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ‘ప్రొడక్షన్ నంబర్‌ 1’ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల(Dr Damodhar Nerella) తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశాంక్‌ దువ్వూరు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి శివతేజ,భాస్కర్‌ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్ర ల్లో నటిస్తుండగా, నేహా పఠాన్‌ కథానాయికగా కనిపించనున్నారు. స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో పాటు సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలను మేళవిస్తూ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.

- Advertisement -

డ్రీమ్ ప్రాజెక్టుగా సినిమా నిర్మాణం :
ఇండియన్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఏఎంఏ) వ్యవస్థాపకులు, సీఈఓ డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్నారు. గత 26 ఏళ్లుగా యూకే, అమెరికాలో వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఆయనకు సినిమాలపై చిన్నప్పటి నుంచే ప్రత్యేక ఆసక్తి ఉంది. మారుమూల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.

తన సినిమా ప్రయాణం గురించి నిర్మాత డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే సినిమాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమా చూడటానికి పాఠశాలకు వెళ్లకుండా వరంగల్‌ వెళ్లిన రోజులు కూడా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ఇన్నాళ్లుగా తనలో ఉన్న సినిమా కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నానని, తన డ్రీమ్ ప్రాజెక్టు దసరా రోజున ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

దర్శకుడు శశాంక్‌ దువ్వూరు చెప్పిన కథ తనకు ఎంతగానో నచ్చిందని, ప్రేమ, స్నేహం, కుటుంబ విలువలతో పాటు మంచి సందేశాన్ని అందించే అంశాలు ఇందులో ఉన్నాయని వివరించారు. దర్శకుడిగా శశాంక్‌కు ఇది తొలి చిత్రమైనప్పటికీ, ఆయన ప్రతిభపై, కథపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.

వినోదంతో పాటు బలమైన కాన్సెప్ట్‌ :
దర్శకుడు శశాంక్‌ దువ్వూరు మాట్లాడుతూ.. గతంలో రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. ‘ఉల్టా’ అనే షార్ట్‌ఫిలింను కూడా రూపొందించినట్లు వెల్లడించారు. ఇప్పుడు దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. పైకి లైట్‌హార్టెడ్‌ ఎంటర్‌టైనర్‌లా కనిపించినప్పటికీ, ఈ సినిమాలో బలమైన కాన్సెప్ట్‌ ఉంటుందని చెప్పారు. ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథలో వినోదంతో పాటు విభిన్నమైన అంశాలను ఆసక్తికరంగా ఆవిష్కరించనున్నట్లు వివరించారు.

రొమాన్స్‌ నుంచి సైన్స్‌ ఫిక్షన్‌ వరకు..:
ఈ చిత్రంలో నటిస్తున్న ప్రధాన పాత్రధారులు మాట్లాడుతూ.. సాధారణ కథలకు భిన్నంగా, పక్కా స్క్రిప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని తెలిపారు. రొమాంటిక్‌ అంశాలతో ప్రారంభమయ్యే కథ క్రమంగా సైన్స్‌ ఫిక్షన్‌ వైపు మలుపు తిరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. కొత్త కథనం, విభిన్నమైన మలుపులతో ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం కృషి చేస్తోందన్నారు. త్వరలోనే సినిమా టైటిల్‌ పోస్టర్‌తో పాటు ఇతర వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు :
డీఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ తొలి చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త దర్శకుడు, యువ నటీనటులు, ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, సైన్స్‌ ఫిక్షన్‌ అంశాల సమ్మేళనంగా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుందని చిత్ర యూనిట్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

నటీనటులు: రవి శివతేజ, భాస్కర్‌ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల, నేహా పఠాన్‌, తదితరులు..
బ్యానర్: డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్.. నిర్మాత: డాక్టర్‌ దామోదర్‌ నేరేళ్ల.. దర్శకుడు: శశాంక్‌ దువ్వూరు.. పీ.ఆర్.ఓ. : అశోక్ దయ్యాల..

- Advertisement -
RELATED ARTICLES

Latest News