- పిల్లల సమగ్ర వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
అంగన్వాడీ కేంద్రాలకు(Anganwadi Centers) వచ్చే చిన్నారులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా అన్ని రకాల మౌలిక వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు.
గురువారం నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లోని చిన్నారులందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కేంద్రాలను పిల్లలను ఆకట్టుకునే విధంగా రంగురంగుల బొమ్మలు, పెయింటింగ్స్, వర్ణమాల, విద్యా చార్టులతో అలంకరించి, ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్యాబోధన అందించాలని తెలిపారు. చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడేలా ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటలు, రైమ్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, ఎత్తు, బరువు తదితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు.

సామ్, మామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి
సామ్, మామ్ కేటగిరీకి చెందిన పిల్లల వివరాలను పకడ్బందీగా నమోదు చేసి, పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి గర్భిణి, బాలింతకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, పోషకాహార సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తనిఖీ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. వారి పేర్లు, చదువు గురించి అడిగి తెలుసుకుని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి రావాలని సూచించారు. చిన్నారులతో రైమ్స్ చెప్పించి, సంఖ్యలు చదివించడంతో పాటు వారికి చాక్లెట్లు అందించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, వైద్యారోగ్య శాఖ అధికారులు పవన్ కుమార్, సౌమ్య, నయనా రెడ్డి, రమేష్, అలీ, సర్పంచ్ హరీష్, ఉప సర్పంచ్ భూమేష్, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
