- ప్రారంభోత్సవానికి సిద్దమైన గుడి..
- టెంపుల్ ను నిర్మించిన అక్షర్ పురుషోత్తం సంస్థ.
ఫ్రాన్స్ లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మొట్టమొదటి భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పారిస్ లోని బుస్సీ-సెయింట్-జార్జెస్ ప్రాంతంలో బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ నిర్మించిన ఈ స్వామినారాయణ్ హిందూ మందిరాన్ని సెప్టెంబర్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు.
ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2 నుంచి 14వ తేదీ వరకు 13 రోజులపాటు ‘ఫెస్టివల్ ఆఫ్ కల్చర్’ పేరిట ప్రత్యేక సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలను బీఏపీఎస్ ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహరాజ్ తన ఆశీస్సులతో పర్యవేక్షించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఈ ఆలయ ప్రారంభోత్సవం, సాంస్కృతిక ఉత్సవాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్సంగ సభల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లోనే బీఏపీఎస్ అధికారికంగా ప్రకటించింది. యూకే, యూరప్ దేశాల బీఏపీఎస్ హెడ్ యోగవివేక్దాస్ స్వామి ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ఈ ఆలయ చారిత్రక ప్రాధాన్యతను, ఉత్సవాల వివరాలను తెలియజేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఒక విశేషం ఉంది. ఆలయానికి అవసరమైన రాళ్లను భారత్ నుంచి ఫ్రాన్స్‌కు తరలించారు.
