- కాంక్రీట్ అత్యంత నాశిరకంగా ఉందని వెల్లడి..
- సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ నివేదిక..
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ నాణ్యతపై మరో విస్మయకర అంశం వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం కుంగిపోయిన బ్యారేజీలోని 7వ బ్లాక్‌లో కాంక్రీట్ నాణ్యత అత్యంత పేలవంగా ఉన్నట్లు పుణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) తన నివేదికలో స్పష్టం చేసింది. బ్యారేజీ పునరుద్ధరణ పనుల అంచనాలో భాగంగా నిర్వహించిన వివిధ పరీక్షల్లో ఈ చేదు నిజం వెల్లడైంది.
సీడబ్ల్యూపీఆర్ఎస్ నిర్వహించిన అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ, రీబౌండ్ హ్యామర్ పరీక్షల్లో 7వ బ్లాక్‌లోని 16 నుంచి 21వ సంఖ్య గల పియర్‌లలో కాంక్రీట్ నాణ్యత అత్యంత తక్కువగా లేదా అనుమానాస్పదంగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా పియర్-19లో గరిష్ఠంగా 73.3 శాతం, పియర్-18లో 65.5 శాతం, పియర్-20లో 61.1 శాతం మేర నాణ్యత లోపాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. నిర్మాణంలో నాణ్యత లోపించడం, నీటి ప్రవాహ ఉద్ధృతికి కాంక్రీట్‌లో ఖాళీలు ఏర్పడటమే 2023లో ఈ బ్లాక్ కుంగిపోవడానికి ప్రధాన కారణమై ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో, 7వ బ్లాక్ పునరుద్ధరణకు సంబంధించి మరిన్ని లోతైన పరిశీలనలు, అదనపు పరీక్షలు నిర్వహించాలని సీడబ్ల్యూపీఆర్ఎస్ సిఫార్సు చేసింది. అయితే, మేడిగడ్డలోని 1 నుంచి 6 వరకు, 8వ బ్లాక్‌లలో కాంక్రీట్ నాణ్యత సంతృప్తికరంగానే ఉందని నివేదిక వివరించింది. అలాగే, అన్నారం బ్యారేజీలో ఎటువంటి నాణ్యత లోపాలు తలెత్తలేదని, సుందిళ్ల బ్యారేజీలోనూ కాంక్రీట్ నాణ్యత స్థిరంగానే ఉందని నివేదిక వెల్లడించింది.
