- డా. గడల శ్రీనివాస రావును నియమిస్తూ ప్రకటన..
- పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన గడల..
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ నాయకత్వం అధికారిక ప్రకటన చేసింది.
ఈ నియామకంపై శ్రీనివాసరావు స్పందిస్తూ… తనపై ప్రత్యేక నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ బాధ్యతను ఎంతో వినమ్రతతో, నిబద్ధతతో స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజా సమస్యలపై జనసేన వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాసేవే తన ప్రథమ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణకు, బలోపేతానికి నిరంతరం శ్రమిస్తూ, క్షేత్రస్థాయి ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి.. పార్టీకి-ప్రజలకు మధ్య బలమైన వారధిగా నిలుస్తానని చెప్పారు. ఈ నియామకానికి సహకరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి, సీనియర్ నాయకత్వానికి, తనకు అండగా నిలుస్తున్న జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
