HomeరాజకీయంJawahar Nagar | బుల్డోజర్ల హల్చల్.. నోటీసుల డ్రామా

Jawahar Nagar | బుల్డోజర్ల హల్చల్.. నోటీసుల డ్రామా

  • అధికారులా..? అక్రమార్కులా..?

జవహర్ నగర్ గ్రేటర్ జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రెవెన్యూ అధికారులు జేసీబీలతో హడావిడి చేస్తుండగా, మరోవైపు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసి కొద్ది రోజులు నిర్మాణ పనులు నిలిపివేయాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది.

అక్రమ నిర్మాణం జరుగుతోందనే సమాచారం అందిన వెంటనే కొందరు రెవెన్యూ అధికారులు జేసీబీలతో సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపడుతున్నప్పటికీ, ఆ తర్వాత పరిస్థితి మారిపోతుందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. నోటీసుల పేరుతో హడావిడి చేసి వెళ్లిన అనంతరం నిర్మాణ పనులు తిరిగి కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

అధికారుల చర్యల మధ్యలో కొందరు మధ్యవర్తులు రంగంలోకి దిగి అధికారులతో మాట్లాడి నిర్మాణాలను పూర్తి చేయిస్తామని నిర్మాణదారులకు హామీలు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు సైతం పూర్తవుతున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్డు ఆక్రమణల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని వారు ఆరోపిస్తున్నారు.

జవహర్ నగర్‌లో వెలుస్తున్న అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక సర్వే నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి పరిరక్షించడంతో పాటు వాటిని అంగన్వాడీ కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ప్రజా అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై కేవలం నోటీసులు, జేసీబీల హడావిడితో సరిపెట్టకుండా నిర్మాణాల వెనుక ఉన్న వ్యక్తులు, అనుమతుల వ్యవహారం, అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News