- మరో యువకుడి పరిస్థితి విషమం.
రోడ్డు ప్రమాదంలో యువ ఫోటోగ్రాఫర్ మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన భూక్య నరసింహ (19) అతని స్నేహితుడు భోజ్య తండకు చెందిన గూగులోత్ గోపి రాములు అలియాస్ కొండ నాయక్ (21) ద్విచక్ర వాహనంపై కోదాడకు వెళ్ళి తిరిగివస్తున్న క్రమంలో చిలుకూరు మండలం సీతారామపురం గ్రామ శివారు కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారి 167 పై ముందు ఉన్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టారు.ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నరసింహకు అలాగే వెనుక కూర్చొని ఉన్న కొండ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఇద్దరినీ హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అక్కడ వైద్యులు భూక్య నరసింహను పరీక్షించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.గుగులోతు గోపి రాములు పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మృతి చెందిన నరసింహను పోస్ట్ మార్టం నిమిత్తం సదరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడు భూక్య నరసింహ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.ఈ ఘటనతో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న చిలుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
