Homeఆదాబ్ ప్రత్యేకంFake Employee Racket | సాక్షాత్తు సీఎం నిర్వహిస్తున్న శాఖలోనే నకిలీ ఉద్యోగుల రాజ్యం

Fake Employee Racket | సాక్షాత్తు సీఎం నిర్వహిస్తున్న శాఖలోనే నకిలీ ఉద్యోగుల రాజ్యం

  • ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న దౌర్భాగ్యం..
  • సర్కార్ కు కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తున్న అవినీతి పరులు..
  • ఉన్నతాధికారుల ఉదాసీనత వైఖరితో రెచ్చిపోతున్న వైనం..
  • గతంలో హయత్ నగర్ లో.. ప్రస్తుతం మూసారాం బాగ్ సర్కిల్ లో..
  • ముందే హెచ్చరించిన ఆదాబ్ హైదరాబాద్
  • ఇప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టి సారించాలి

రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తున్న పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కు చెందిన అధికారుల నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న ఈ కీలక శాఖలోనే నకిలీ ఉద్యోగులు చెలరేగిపోతుండటం,(Fake Employee Racket) ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతుండటం, ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తుండటం.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చేతిలోనే పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ పనిచేస్తోంది అన్న కనీస భయం కూడా లేకుండా, కొందరు కేటుగాళ్లు జీహెచఎంసీ పరిధిలో సాగిస్తున్న అక్రమాలు ప్రభుత్వ పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

నకిలీల పరంపర.. వరుసగా వెలుగులోకి అక్రమాలు :

గతంలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్.బీ.నగర్ జోన్, హయత్ నగర్ సర్కిల్‌లో నకిలీ ఉద్యోగుల గుట్టును(Fake Employee Racket) ఆదాబ్ బయటపెట్టినా, సంబంధిత యంత్రాంగంలో చలనం రాలేదు. తాజాగా జీహెచఎంసీ చార్మినార్ జోన్, మూసారాంబాగ్ సర్కిల్‌లో వెలుగులోకి వచ్చిన దారుణమైన ఉదంతం ఈ వ్యవస్థలోని లోపాలను కళ్లకు కడుతోంది. ఈ నకిలీ ఉద్యోగి భాగోతాన్ని ఆదాబ్ బయటపెట్టింది.. ఎట్టకేలకు నకిలీ ఉద్యోగిని మలక్ పేట్ పీఎస్, పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు..

- Advertisement -

హయత్ నగర్ లో జరిగిన వ్యవహారం :

హయత్ నగర్ సర్కిల్‌లో నకిలీ ఉద్యోగి ఎల్. శ్రీనివాస్ సృష్టించిన లీలలపై డాక్యుమెంట్ నెంబర్ 4796/2024 రూపంలో ఆధారాలున్నాయి. నకిలీ ఐడీ కార్డు, నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లతో ఏకంగా మార్టిగేజ్ రిలీజ్ చేశాడు. ఇలాంటి నకిలీ రిలీజ్‌లు ఆ ప్రాంతంలో ఎన్ని జరిగాయో లెక్కతేలాల్సి ఉంది. అయితే, ఇంత తీవ్రమైన అవినీతి జరిగినా ఇప్పటివరకు హయత్ నగర్ వ్యవహారంపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనం.

మూసారాంబాగ్ సర్కిల్ మోసం :

ఇక మూసారాంబాగ్ సర్కిల్‌లో జరిగిన మరో అక్రమం విస్తుపోయేలా చేస్తోంది. దిల్ సుఖ్ నగర్ కాలనీలోని హౌస్ నెంబర్ 16-11-20/5/3/1 కి సంబంధించి ఫైల్ నెంబర్ 1522 సి హెచ్ ఆర్/ 1487/2025 (తేదీ: 31-10-2025) ద్వారా నకిలీ మార్టిగేజ్ రిలీజ్ చేసాడు నకిలీ ఉద్యోగి సి.హెచ్ శివనాగేశ్వర్ రావు గజానంద్ అనే సిటీ ప్లానర్ పేరుతో నకిలీ సంతకాలు, నకిలీ స్టాంపులు తయారు చేసి అడ్డగోలుగా వాడుతూ ఈ వ్యవహారానికి పాల్పడ్డాడు..

Fake Employee Racket in GHMC Circles.jpg1

అడ్డంగా దొరికిన కేటుగాడు..:

తాజాగా ఈ దందాను కొనసాగించే క్రమంలో ఆ నకిలీ ఉద్యోగి సి.హెచ్ శివనాగేశ్వర్ రావు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. హౌస్ నెంబర్ 6-9-1, ఓల్డ్ మలక్‌పేట్, హైదరాబాద్ అడ్రస్‌తో నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయడానికి వచ్చిన నిందితుడిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఓసీ ప్రొసీడింగ్ నెంబర్ 2/సి 27/4212/2026 (తేదీ: 8-9-2026) తో చార్మినార్ జోన్ నుంచి ఓసీ రిలీజ్ చేయడానికి ఏకంగా అథెంటికేషన్ కూడా తీసుకుని రావడం గమసార్హం. పక్కా సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అరెస్ట్ కావడం, మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎఫఐఆర్ నమోదు కావడం జరిగిపోయాయి.

ముఖ్యమంత్రి అంటే భయం లేదా? :

స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖలోనే ఇంత బహిరంగంగా నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ ఐడీలతో దందాలు సాగుతున్నాయంటే.. వ్యవస్థ ఎంతలా భ్రష్టుపట్టిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుతామని, అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి సొంత శాఖలోనే ఈ స్థాయిలో అవినీతి జరుగుతుందంటే, అధికారులకు ప్రభుత్వ నాయకత్వంపై ఎలాంటి భయం ఉందో ఇట్టే తెలుస్తోంది.

ఎవరి ప్రమేయం ఉంది?

కిందిస్థాయిలో నకిలీ ఉద్యోగులు ఇంత ధైర్యంగా నకిలీ ఐడీ కార్డు, నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లతో ఏకంగా మార్టిగేజ్‌లు రిలీజ్ చేస్తుంటే.. వెనుక ఉండి ఈ చక్రం తిప్పుతున్న అసలు సూత్రధారులు, పెద్ద అధికారులు ఎవరు?

ప్రభుత్వానికి ఎంత నష్టం?

ఇప్పటివరకు ఇలాంటి నకిలీ సర్టిఫికెట్లు, అక్రమ మార్టిగేజ్ విడుదలల ద్వారా ప్రభుత్వ ఖజానాకు, జీహెచఎంసీ ఆదాయానికి ఎంత భారీ నష్టం వాటిల్లిందో సమగ్ర విచారణ జరగాలి. పాలనా పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఈ పురపాలక శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే శాఖా పరమైన పర్యవేక్షణ లోపం ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మారే ప్రమాదం ఉంది. ఈ నకిలీ బాగోతంపై సమగ్ర సీఐడీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, అసలు దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు, పౌర సంఘాలు కోరుతున్నాయి. జరుగుతున్న ఈ వ్యవహారాలపై ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజాన్ ఐఏఎస్, ( ఎం.ఏ.యూ.డీ. ) దృష్టి సారించి సవివరంగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలి..

అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వీ. కర్ణన్, ఐఏఎస్ కూడా దృష్టి సారించాలి.. ఇంత నిర్భయంగా నకిలీ ఉద్యోగులు ద్యుప్లికేట్ ఐడీలతో, ఉద్యోగులమని కలరింగ్ ఇస్తూ, ఏకంగా ఫేక్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్, మార్టిగేజ్ లు విడుదల చేస్తుంటే విజిలెన్స్ విభాగం ఏమి చేస్తోంది.. ఇలాంటి వారిని గుర్తించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్ ఏమి చేస్తున్నారు..?

ప్రభుత్వ ఖజానాకు కోట్లాదిరూపాయలు గండి పడుతుంటే ప్రజా సంక్షేమం ఎలా సాగుతుంది.. ఈ విధంగా ఎన్ని అక్రమాలు జరిగాయో..? అవన్నీ విచారణ చేయాలి.. లేకపోతే ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలగడం ఖాయం.. ఇలాంటి నకిలీల వ్యవహారాలపై ఆదాబ్ హైదరాబాద్, ఎన్నో కథనాలద్వారా వెలుగులోకి తీసుకుని వచ్చాము.. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టం.. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టిపెట్టి తగిన విధంగా స్పందించాలని పలువురు కోరుతున్నారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News